Invitation To AP Governor : ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ, చైతన్య విద్యా సంస్థల సంయుక్తంగా తెలుగు భాషా వికాసాన్ని నలుదిశలా వ్యాపింపజేసే ఉద్దేశంతో ఆంధ్రమేవ జయతే అంటూ తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా జనవరి 5,6,7తేదీల్లో రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా సహస్రాబ్ధి ఉత్సవాలు జరపనుంది.
రాజమండ్రిలోని గైట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా జనవరి 5 ఉదయం 9 గంటలకు జరిగే ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రానున్నట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు చైతన్యరాజులు తెలిపారు.
తెలుగు మహాసభలలో నిర్వహించే అంశాలపై వివరణ ఇవ్వనున్నారు. తెలుగు మహాసభలకు సహకరిస్తున్నసేవా తత్పరులు, తెలుగు భాషాభిమాని చైతన్యరాజును గవర్నర్ అభినందించారు. తెలుగు భాషా వికాసానికి పాటుపడుతున్న వారిని గౌరవించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగు భాష మాట్లాడేవారు ఎక్కడున్నా భాష నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పాటుపడతారని కోరారు.
దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నారో సినీకవి. తెలుగునేల పులకించేలా తెలుగు ఖ్యాతి వినిపించేలా సభలు నిర్వహించడం గర్వకారణం. తెలుగు భాష ఎదుగుదలకు పని చేసే వారికి పట్టం కట్టాలని డాక్టర్ గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.