IAS Pooja Khedkar : వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై విచారణ కమిటీ
IAS Pooja Khedkar : వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఒక సభ్యుడితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీ నిజనిర్ధారణ చేయనుంది. పుణెలే బ్యూరోక్రాట్ గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో ఖేద్కర్ వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రొబేషన్ లో రెండేళ్లపాటు ఉంటే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.
మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్ లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా, పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్ మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్ లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది.