Delhi Airport : విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. ఢిల్లీ విమానాశ్రయంలో ఇబ్బందులు
Delhi Airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ అంతరాయంతో బోర్డింగ్, చెక్-ఇన్ ప్రక్రియలకు ఇబ్బందులు కలుగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ప్రయాణికులు తమ పోస్టుల్లో టెర్మినల్ 3లో అరగంట నుంచి కరెంట్ లేదని, ఇబ్బందులు ఎదుర్కుంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, కరెంటు అంతరాయానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. దీనిపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ స్పందించింది. సమస్యను పరిశీలిస్తున్నామని, విద్యుత్ ను పునరుద్ధరించడానికి తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో మూడు టర్మినల్స్ ఉండగా మొదటి రెండు దేశీయ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. మూడో టర్మినల్ దేశీయ, అంతర్జాతాయ కార్యకలాపాలకు వినియోగిస్తారు. కొద్ది నిమిషాల పాటు విద్యుత్తు అంరాయం ఏర్పడిందని, ప్రస్తుతం సమస్య పరిష్కారమైందని కొందరు ప్రయాణికులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లోని మండోలాలోని పవర్ గ్రిడ్ లో అగ్నిప్రమాదం జరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. నగరానికి ఈ గ్రిడ్ నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది.