NEET : నీట్ యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్-యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు మాత్రం ఒక్కదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. సదరు ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన ముగ్గురు నిపిణులను ఏర్పాటు చేసి, జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు దానిపై సమాధానం సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ ఢైరెక్టర్ ను ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అంతకుముందు ఇదే అంశంపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మే 4కు ముందే పేపర్ లీక్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. బీహార్ పోలీసుల దర్యాప్తు నివేదికను ప్రస్తావిస్తూ.. స్ట్రాంగ్ రూం నుంచే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా..? అని ప్రశ్నించింది.