Bus Laboratory : ఇన్నోవేషన్స్ ఆన్ వీల్స్.. బస్సులో ల్యాబోరేటరీ
Bus Laboratory : తెలంగాణ, ఏపీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన 18 మంది యువకులు కలిసి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. వేర్వేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకున్న వీరందరూ ఒకటై ‘ఎధోద్వజ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఓ బస్సును ఎంచుకున్నారు. దానికి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (ఫ్లూ) అని పేరు పెట్టారు.
అందులో సోలార్ పవర్ ద్వారా కట్టింగ్ ఎడ్జ్, డ్రోన్, ఏఐ, మెకానిక్ లెర్నింగ్ టెక్నాలజీలను వినియోగించుకుంటూ రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, హోలోగ్రామ్స్ పై ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు. ఫ్లోను రూపొందించిన యువ ఇంజనీర్లు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించి, వారి ఆవిష్కరణలను మీడియాకు పరిచయం చేశారు.
సంస్థ సీఈవో మధులాష్ బాబు, సీటీవో పవన్ కుమార్, మౌనిక మాట్లాడుతూ తాము రూపొందించిన ఆవిష్కరణలను త్వరలో రాష్ట్రంలోని అన్ని స్కూల్లు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రదర్శనకు ఉంచుతామని, స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఫ్లూ రూపకల్పనకు అమెరికాకు చెందిన జార్జి మాసన్ యూనివర్సిటీ రూ.80 లక్షలు, తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ రూ.25 లక్షలు సాయం అందించాయని వెల్లడించారు.