Nimmala Ramanaidu : ఏపీకి కృష్ణా జలాల్లో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి వల్లే అన్యాయం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తాజా ట్రిబ్యునల్ అంశాలు, పరిణామాలపై రామానాయుడు సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగులు జలాలు కోరబోమని లేఖ రాసి రాయలసీమకు, కృష్ణా నీటి హక్కులకు నష్టం కలిగించారని గుర్తు చేశారు. జగన్ హయాంలో ట్రిబ్యునల్ విచారణాంశాల పరిధి పెంచకుండా గట్టిగా పోరాడలేకపోయారని, అందువల్లే తెలంగాణ మళ్లీ అన్ని అంశాలు తిరగతోడేందుకు వీలు కలిగిందని పేర్కొన్నారు.
కేంద్రం అక్టోబరులో బ్రిజేష్ ట్రిబ్యునల్ కు అదనపు అంశాలు అప్నజెబుతూ నోటిఫికేషన్ విడుదలయ్యే ముందే జగన్ స్పందించి రాష్ట్ర హక్కులు తెలియజేసి, ఆ నోటిఫికేషన్ రాకుండా చూసి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అలాంటి మెతక వైఖరి అవలంబించదన్నారు. ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకునేలా కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని తెలిపారు.