Industries : ఏపీకి వరుసగా పరిశ్రమలు, పెట్టుబడులు.. అబ్బా ఈ మాట విని ఎన్నాళ్ళయిందో!

Industries

Industries in AP, IT Minister Lokesh

Industries in AP : 2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రస్తుతం దాని లక్ష్యం ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధే ఖచ్చితంగా అయ్యుండాలి. మొదటి ఐదేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశలో కొన్ని అడుగులు వేశారు. కానీ తర్వాత దానిని కొనసాగించాల్సిన వైఎస్ జగన్‌ సంక్షేమ పథకాల బాట పట్టడంతో చంద్రబాబు నాయుడు ఐదేళ్ల కృషి బూడిదలో పోసిన పన్నీరు అయింది. కనుక మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదలచుకోలేదు. ఆ క్రమంలోనే పలు కంపెనీలు, బడా పారిశ్రమిక వేత్తలతో ఇండస్ట్రీలు, పెట్టుబడుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా దుబాయ్‌కి చెందిన ‘లూలూ గ్రూప్ ఇంటెర్నేషనల్’ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో త్వరలోనే రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టి హైపర్ మార్కెట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ, మల్టిప్లెక్స్ లను ఏర్పాటు చేయబోతోంది.

మరో పక్క మంత్రి నారా లోకేష్‌ కూడా తండ్రి బాటలోనే ఆ దిశలో అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం-సీఐఐ భాగస్వామ్యంలో ఓ కన్సల్తేటివ్ ఫోరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఆయనే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనిలో ఆర్ధిక, రెవెన్యూ, పరిశ్రమలు తదితర శాఖల అధికారులు, సీఐఐ తరపు సభ్యులు ఉంటారు. వీరు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకి అవసరమైన విధివిధానాలు రూపొందిస్తారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో లభించే సహజ వనరులు, మానవ వనరులు, వ్యాపార అవకాశాలను గుర్తించి ఆ వివరాలను ఇన్వెస్టర్లతో పంచుకుంటారు. పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకు మధ్య ఆయన వారధిగా పనిచేస్తారు.  రెండేళ్ళ కాలపరిమితితో ఈ ఫోరం పనిచేస్తుందని పరిశ్రమల శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.  ఒక పరిశ్రమ లేదా ఓ ఐటీ కంపెనీ లేదా ఓ వాణిజ్య సంస్థ ఏర్పాటు కావాలంటే ఇరువైపుల నుంచి చాలా కృషి, నిబద్దత అనేవి అవసరం. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి చేతులు దులుపుకుంటే సరిపోదు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, ప్రభుత్వానికి సరైన విధానాలు కూడా చాలా ముఖ్యం. ఏపీలో  ఇప్పుడు అటువంటి చక్కటి వాతావరణమే ఏర్పడింది. ఈ ఫోరం ఏర్పాటు కూడా ఆ దిశలో చేస్తున్న ఓ మంచి ప్రయత్నమే. కనుక ఈసారి రాష్ట్రానికి అనేక ఇండస్ట్రీలు, పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

TAGS