India VS Pakistan : న్యూయార్క్ లోని నసవు కౌంటీ స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో టీం ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 19 ఓవర్లు మాత్రమే ఆడి 119 పరుగులకు ఆలౌట్ అయింది. పూర్తిగా బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ రన్స్ చేయడానికి కష్టపడ్డారు. విరాట్ కొహ్లి తన పూర్ పర్ఫామెన్స్ తో 4 పరుగులకే ఔట్ కాగా.. రోహిత్ 11 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు.
రిషబ్ పంత్ మాత్రం బౌలింగ్ పిచ్ అని చూడకుండా ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును 10 ఓవర్లలోనే 80 దాటించాడు. కానీ 11 ఓవర్ల నుంచి పాక్ బౌలర్లు రెచ్చిపోయారు. హరీస్ రౌఫ్, నసీమ్ షా మూడు వికెట్లు తీసి ఇండియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
మొదటి ఆరు ఓవర్లలో 50 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయిన ఇండియా.. 11 నుంచి 15 ఓవర్ల మధ్య 15 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. 120 పరుగుల ఛేజింగ్ తో బరిలో దిగిన పాక్ కు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం మంచి ఆరంభమే ఇచ్చారు. రిజ్వాన్ క్యాచ్ శివమ్ దూబె విడిచిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్న రిజ్వాన్ 31 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. 10 ఓవర్లకు 57 పరుగులు చేసి కేవలం ఒక్క వికెట్ కోల్పోయిన పాక్ గెలుపు దిశగా ప్రయత్నిస్తుండగా.. అక్షర్ పటేల్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఉస్మాన్ ఖాన్ ను ఎల్బీగా వెనక్కి పంపి మళ్లీ ఇండియాను మ్యాచ్ లోకి తెచ్చాడు.
అనంతరం బుమ్రా చెలరేగి రిజ్వాన్ ను బౌల్డ్ చేయగా.. మూడు వికెట్లతో రాణించాడు. 19 ఓవర్ లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి గెలుపు ఖాయం చేయగా.. చివరి ఓవర్ లో 18 పరుగులు చేయాల్సిన సమయంలో అర్షదీప్ పని పూర్తి చేశాడు. చివరి మూడు బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన నసీమ్ భయపెట్టినా.. చివరి బంతికి యార్కర్ వేసి భారత్ కు మరుపురాని విజయాన్ని అందించాడు.