Indian Stock Market : భారత్ అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ ముందుకెళ్తోంది. మంగళవారం (మే 21) బాంబే స్టాక్ ఎక్స్చేంజీ(బీఎస్ఈ) మరో చారిత్రాత్మక మైలు రాయిని దాటింది. మొట్ట మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరింది. నిన్న ట్రేడింగ్ ముగిసేసరికి మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రికార్డు గరిష్టమైన రూ.414.62 లక్షల కోట్లుగా నమోదైంది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ ఫీట్ అందుకోవడం గమనార్హం. 2023 నవంబర్ 29న మార్కెట్ క్యాప్ 4 లక్షల కోట్ల డాలర్లను తాకింది.
ఇప్పుడు 5 లక్షల కోట్ల డాలర్లను తాకడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన కరెన్సీలో చెప్పుకుంటే అక్షరాలా 414 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఘనతతో ఇండియా అతిపెద్ద 5వ స్టాక్ మార్కెట్‌గా రికార్డుకెక్కింది. భారత్ కంటే హాంగ్‌కాంగ్, జపాన్, చైనా, యూఎస్‌ఏ మార్కెట్లు ముందున్నాయి.
ఇక మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 98.05 పాయింట్లు క్షీణించి 73,907.89కి చేరగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 24.4 పాయింట్లు పెరిగి 22,526.4 వద్దకు చేరుకుంది. పీఎస్ యూ బ్యాంకింగ్ విభాగం ఎఫ్ఎంసిజి వెనుకబడి ఉన్నా.. మెరుగైన పనితీరును కనబరిచిందని ప్రోగ్రెసివ్ షేర్స్ డైరెక్టర్ ఆదిత్య గగ్గర్ తెలిపారు. బ్రాడర్ మార్కెట్లలో మిడ్ క్యాప్ లు స్వల్పంగా పెర్ఫార్మ్ చేయగా.. స్మాల్ క్యాప్ లు స్వల్ప నష్టాలను చూశాయి.
కాగా, భారత స్టాక్ మార్కెట్ ఈ ఘనత సాధించడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ సర్కార్ 400 సీట్లు సాధించి మోదీ మూడో సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరిన్ని విజయాలు నమోదు అవుతాయని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.