Russia : రష్యా నదిలో భారత మెడికోలు గల్లంతు
Russia : రష్యాలోని ఓ నదిలో భారత మెడికల్ స్టూడెంట్లు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మొదట ఒక విద్యార్థి నదిలో పడడంతో కాపాడేందుకు ప్రయత్నించిన నలుగురు కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. రెస్క్యూ టీం ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, అందరూ మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాకు చెందినవారు.
రష్యాలో పురాతన నగరమైన నోవోగరోడ్ లోని యూనవర్సిటీలో జీషన్ పింజారీ, జియా పింజారీ, హర్షల్ అనంత్ రావ్, మాలిక్ మహమ్మద్ యాకూబ్, నిషా సోనావానే మెడిసిన్ చదువుతున్నారు. శుక్రవారం ఖాళీ సమయంలో సిటీకి దగ్గరలో ఉన్న నదీ తీరానికి వాకింగ్ వెళ్లారు. వాకింగ్ చేస్తుండగా అందులో ఒకమ్మాయి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు మిగతా నలుగురూ నీళ్లలోకి దిగగా ప్రవాహ తీవ్రతకు నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో నిషాను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందడంతో పోలీసులు, రెస్క్యూటీం స్పాట్ కు చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.