Indian food : ఈ ప్రపంచంలో భారత ఆహారమే బెస్ట్
Indian food : ఒక్కో దేశానికి ఒక్కో ఆహారపు అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఏ దేశ ఆహారం, పద్ధతులు ఉత్తమమైనవి అంటే భారతదేశమనే చెబుతున్నాయి. మానవ ఆరోగ్యం, భూమిపై కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాలలో భారతీయ ఆహారం (ఇండియన్ ఫుడ్ ప్లేట్) పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు ఉత్తమమైనవి అని వారు నిర్ధారించారు. కొన్ని దేశాల ఆహారం మొత్తం భూగోళానికి ప్రమాదకరమని కూడా ఆ సంస్థలు చెబుతున్నాయి.
స్విస్‌కు చెందిన నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇటీవల తన లివింగ్ ప్లానెట్ పరిశోధనలో ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో భారతీయ ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. శాకాహారం ఎక్కువగా, మాంసాహారం తక్కువగా తీసుకోవాలనే భారత విధానం ఉత్తమమని పేర్కొంది. తక్కువ రసాయన ఎరువులతో భారతదేశం అనుసరిస్తున్న ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడించింది. అన్ని దేశాలు ఈ పంట ఉత్పత్తి విధానాన్ని అనుసరిస్తే పర్యావరణం బాగుంటుందని పేర్కొంది. 2050 నాటికి పర్యావరణ కాలుష్యాన్ని చాలా వరకు అరికట్టవచ్చని సూచించింది. భారత్ తర్వాత ఇండోనేషియా, చైనాలు అత్యంత చెత్త ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నాయి. అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి దేశాల ఆహారపు అలవాట్లు ప్రపంచానికి, పర్యావరణానికి ప్రమాదకరమని చెబుతోంది.