India TV Survey : ఇండియా టీవీ సర్వే.. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా..

India TV Survey

India TV Survey

India TV Survey : ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలు, మ్యానిఫెస్టో తయారీలో బిజీబిజీగా మారిపోయాయి. ఈక్రమంలోనే బహిరంగ సభలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు, లోక్ సభ క్లీన్ స్వీప్ ధ్యేయంగా ముందుకెళ్తోంది. జగన్ పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటిగా కలిసి సాగుతున్నాయి. తాము కలిస్తే జగన్ కు చుక్కలే అని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. ఈ సారి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు లోక్ సభలో భారీగా సీట్లు సాధించుకుంటామని వారు భావిస్తున్నారు.

పార్టీల తీరు ఇలా ఉండగా పలు సర్వే సంస్థలు జనాల నాడీని పట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. కొన్ని సర్వేలు వైసీపీదే ఘన విజయమని, మరికొన్ని టీడీపీ కూటమిదే ఏపీ అని చెప్పాయి. తాజాగా మరో సర్వే సంస్థ తన ఫలితాలను ప్రకటించింది. ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తన నివేదికను వెల్లడించింది.

2024 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 15 ఎంపీ స్థానాలు, టీడీపీ, జనసేన కూటమి 10 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుపడం గమనార్హం.  కాంగ్రెస్, బీజేపీలకు ఏపీలో ఒక్క సీటు రాదని తేల్చింది. కాకపోతే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీలు సత్తా చాటుతాయని చెప్పింది. దక్షిణాదిలోని 132 ఎంపీ స్థానాలకు ఎన్డీయే కూటమి 38, ఇండియా కూటమి 60, ఇతరులు 32 గెలుచుకోవచ్చని అంచనా వేసింది.

కాగా, ఇండియా టీవీ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా రావడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గతంలో పలు సర్వేలు వైసీపీ 25, 23,20 సీట్ల దాక వస్తాయని చెప్పాయి. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసిన ఇండియా టీవీ 15 సీట్లకే వైసీపీ పరిమితం అవుతుందని తేల్చింది. దీన్ని బట్టి చూస్తే వైసీపీ సీట్లు తగ్గినట్టే లెక్క. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉంటాయి. ఎన్నో వ్యూహాలు ఉంటాయి. ఎన్నికల ముందు ఏ పార్టీ జనాలను అధికంగా ప్రభావితం చేస్తుందో ఆ పార్టీకే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి.

TAGS