IND vs NZ Semis Today : వరల్డ్ కప్ 2023 తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచులన్నీ పూర్తయ్యాయి. ఇక బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కివీస్, టీమిండియాల మధ్య మొదటి సెమీస్ మ్యాచ్ జరగబోతున్నది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్ కు చేరుతుంది. అయితే ఈ మ్యాచ్ పై భారత అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. గత అనుభవాల నేపథ్యంలో టీమిండియా గట్టెక్కుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది
సరిగ్గా నాలుగేళ్ల క్రితం వరల్డ్ కప్ లో ఇలాంటి అనుభవమే టీమిండియాకు ఎదురైంది. సెమీస్ లో ఇదే కివీస్ జట్టుపై టీమిండియా ఓటమి పాలైంది. నాలుగేళ్ల నాటి ఓటమికి ఈ రోజు రోహిత్ సేన బదులు తీర్చుకోవాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నాడు ధోనీ రౌనౌట్ తో టీమిండియా ఓడిపోవడం తీవ్ర భావోద్వేగానికి గురి చేశాయి. ఇప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ నాడు కన్నీటి పర్యంతమవ్వడం అందిరి గుండెల్లో బాధను మిగిల్చింది. కానీ ప్రస్తుతం టీమ్ పటిష్టంగా ఉంది. అన్ని విభాగాల్లో టీమిండియా దూకుడుగా కనిపిస్తున్నది.
అయితే 2019 ప్రపంచకప్ లో కూడా టీమిండియా టాప్ వన్ ప్లేస్ లో ఉండగా, న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు సరిగ్గా 2023 వరల్డ్ కప్ లో కూడా అదే రిపీటయ్యింది. మరి ఈసారి అదే జట్టుతో మ్యాచ్. ఇరు జట్లపై ఈసారి ఒత్తిడి కూడా మరింత పెరిగింది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడం మాత్రమే ఇక్కడ టీమిండియాకు అదనపు అడ్వాంటేజ్. ఇక ఈ టోర్నీలో ఓటమే లేని జట్టుగా నిలిచిన రోహిత్ సేన సెమీస్ లో గెలిచి, ఫైనల్ కు చేరుకోవాలని ప్రతి భారత అభిమాని ఆశ పడుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో వాంఖడే స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఇక టాస్ ఎవరు గెలుస్తారో వారు బ్యాటింగ్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇలాంటి సందర్భంలో భారత జట్టు నాటి ఓటమికి బదులు తీర్చుకుంటుందా.. లేదా అనేది మరికొన్ని గంటల్లో కీలకం కానుంది. అయితే జట్టులో మార్పులేమి లేకుండా నే టీమిండియా బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.