India Liquor Chart : ఒక రీల్ అందులో ఏముందంటే ‘మా ఇంటికి ఎవరైనా వస్తే మంచి చెడు కనుక్కొని పంపించం.. రా కూసుందాం.. తాగుదాం.. అంటూ పిలుస్తాం. చుక్క తీసుకోకుండా వెళ్లిపోతే మమ్ములను అవమానించినట్లే. అది కల్లు అయినా.. మందు అయినా..’ ఈ వీడియో సారాంశం. అయితే ఇది అక్షరాల నిజమని ఎన్ఐపీఎఫ్ పీ నివేదిక చెప్తోంది. దేశం మొత్తం నిర్వహించిన సర్వేలో తెలుగు రాష్ట్రాలు ముందుండగా.. అందులో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక మందు నిత్యం దొరికే గోవా లాంటి రాష్ట్రం చివరలో ఉండడం విశేషం.
తెలుగు వారు అందునా తెలంగాణ ప్రజలు మద్యం ప్రియులని మరోసారి నిరూపితమైంది. మద్యం తాగే విషయంలో వీరికి ఎలాంటి భయాందోళనలు లేవనే విషయాన్ని కొట్టిపారేయలేం. మద్యంపై తలసరి వార్షిక వ్యయంపై న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ ఐపీఎఫ్ పీ) ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా వివరించారు. సగటున ఏడాదికి రూ. 1623 మద్యంపై ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇందులో తెలంగాణ మొదటి ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా తక్కువేమీ కాదు.. ఒక్కో ఏపీ వాసి మద్యం కోసం ఏడాదికి రూ. 1306 ఖర్చు చేస్తున్నారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో మద్యంపై రూ. 745గా ఉన్న తెలంగాణ వ్యయం 2022-23 నాటికి రూ.1,623కు పెరిగిందని నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖర్చులు రూ. 365 నుంచి రూ. 1,306కు పెరిగాయి.
దీనికి విరుద్ధంగా అధిక మద్యం వినియోగంతో సంబంధం ఉన్న గోవా, కేరళ వంటి రాష్ట్రాలు గత దశాబ్దంలో తగ్గుదల ధోరణులను చూపిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మద్యంపై ఖర్చును దాదాపు రెట్టింపు లేదా మూడింతలు (ఏపీ) పెంచాయి. ఈ విషయంపై ఆలోచించాలని పలువురు ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.