Gold Reserves : భారతీయులకు బంగారంటే ఎంత మోజో తెలియంది కాదు. చేతిలో ఓ ఇరవై వేలు ఉన్నాయంటే చాలు ఇంత బంగారం కొని దాచేసుకుంటారు జనాలు. బంగారం రేటు తగ్గిందంటే చాలు అవసరమున్నా లేకున్నా తులాల లెక్కన కొని భద్రపరుచుకుంటారు. ఇక మన ప్రతీ శుభకార్యంలోనూ బంగారానిదే కీలక పాత్ర. పెళ్లిళ్లలో వధువు, వరుడికి పెట్టిపోతల కింద బంగారమే పెడుతారు. ఇక ఏ ఫంక్షన్ కు వెళ్లినా మహిళలు తమ ఆభరణాలు అన్నింటినీ ధరించి వెళ్లి ఆనందపడుతుంటారు. మహిళలు చేసే డిస్కషన్స్ లో తొలి ప్రాధాన్యముండేది బంగారానికే. బంగారంతో భారతీయులకు ఉండే అనుబంధం వెలకట్టలేనిది.
తాజాగా ప్రపంచ పసడి సమాఖ్య ఓ నివేదికను వెల్లడించింది. బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. భారత్ వద్ద 3,59,208 కోట్ల(48,157 మిలియన్ డాలర్లు) విలువైన 800.78 టన్నుల బంగారం ఉంది. ఈ ఘనతతో ధనిక దేశాలైన సౌదీ అరేబియా, యూకే వంటి దేశాలను భారత్ వెనక్కి నెట్టింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా వద్ద ప్రస్తుతం 4,89,133 మిలియన్ డాలర్ల విలువైన 3,352 టన్నుల బంగారం నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఉన్నాయి.
అయితే దేశాలు బంగారం నిల్వలపై ఎందుకింత ఆసక్తి చూపుతాయో ఇప్పుడు చూద్దాం.. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. దేశ కరెన్సీలో భారీ మార్పులు రాకుండా ఉండేందుకు.. మార్కెట్ లో సుస్థిరంగా ఉండేందుకు బంగారాన్ని నిల్వ చేస్తాయి. అంతే కాదు తాము పెడుతున్న పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటాయి.
ఆర్థికంగా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు ఆయా దేశాలు బంగారాన్ని వివిధ ప్రపంచ సంస్థల వద్ద తనఖా పెట్టి అప్పు తెచ్చుకుంటాయి. అలా అప్పు తెచ్చుకుని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాయి. మన దేశం సైతం గతంలో ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు బంగారాన్ని విక్రయించి డబ్బులు తెచ్చుకుంది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడడంతో మళ్లీ మన బంగారాన్ని తెచ్చుకుంది. ఇలా దేశాలు బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తుంటాయి. అందుకే డబ్బులు ఉన్నప్పుడు సాధారణ వ్యక్తుల లాగే దేశాల ప్రభుత్వాలు కూడా బంగారాన్ని కొని నిల్వ ఉంచుకుంటాయి.