Buddhism : ప్రపంచానికి భారత్‌ బౌద్ధాన్నిచ్చింది.. యుద్ధాన్ని కాదు: మోడీ

Modi

Modi

Buddhism :  రెండు రోజుల ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రెండో రోజు వియన్నాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశం ప్రపంచానికి బౌద్ధాన్ని ఇచ్చిందని.. యుద్ధాన్ని కాదని అన్నారు. వియన్నాలో జరిగిన ఈ కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైకి రాగానే.. ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “ఇది నా మొదటి ఆస్ట్రియా పర్యటన. నేను ఇక్కడ చూస్తున్న ఉత్సాహం అద్భుతమైనది. 41 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని ఇక్కడకు వచ్చారు.  భారతదేశం, ఆస్ట్రియా 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్నాయి.” అన్నారు.

భౌగోళికంగా భారతదేశం, ఆస్ట్రియా రెండు వేర్వేరు చివరలలో ఉన్నాయి. అయితే మా మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు. ప్రజాస్వామ్యం మన రెండు దేశాలను కలుపుతుందన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, చట్ట పాలన పట్ల గౌరవం మన ఉమ్మడి విలువలు. మన రెండు సమాజాలు బహుసాంస్కృతిక, బహుభాషా సంఘాలు. వియన్నా విశ్వవిద్యాలయంలో 200 సంవత్సరాల క్రితం సంస్కృతం బోధించబడిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది 1880లో మరింత బలపడింది. వేల ఏళ్లుగా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతున్నాం.. యుద్ధాలు ఇవ్వలేదు.. బుద్ధుడిని ఇచ్చాం.. యుద్ధం కాదు అని ప్రపంచానికి సగర్వంగా చెప్పగలమని ప్రధాని మోదీ అన్నారు.

ఆస్ట్రియాలో, ప్రధాని మోదీ భారతదేశంలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. భారత్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 65 కోట్ల మందికి పైగా ఓటేశారు. ఇంత పెద్ద ఎన్నికలు జరిగి కొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు తేటతెల్లమయ్యాయి. ఇది భారతదేశ ఎన్నికల యంత్రాంగం,   ప్రజాస్వామ్య బలమన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలూ చరిత్రాత్మకమైనవని గుర్తుచేశారు. దీని వల్ల ఉభయ దేశాలూ లబ్ధి పొందాయన్నారు. సంస్కృతి, వాణిజ్యం.. అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతోందన్నారు. మోదీ ప్రసంగిస్తున్నంతసేపూ అక్కడి ప్రవాసులు ‘భారత్‌ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో సభను హోరెత్తించారు.

TAGS