Indian Defence : ఒకప్పుడు భారత్ పై ముప్పేటా శత్రువులు పొంచి ఉండేవారు. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా పక్కలో బల్లెం ఉండేవి. అనేక సార్లు పాకిస్తాన్ పీచమణిచినా..కశ్మీర్ ను అడ్డుపెట్టుకుని ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజేస్తుంటుంది. గత పదేళ్లుగా పాక్ పప్పులు పెద్దగా ఉడకడం లేదనుకోండి. ఇక అన్ని రంగాల్లో పోటీగా తయారవుతున్న భారత్ ను చూసి చైనాకు కంటగింపుగా కనపడుతోంది. ఏదో విధంగా చూసి భారత్ ను దెబ్బతీయాలని చూస్తోంది.
అందుకే డోక్లాం వివాదం, గల్వాన్ లోయ ఉద్రికత్తలు, అరుణాచల్ ప్రదేశ్ తమదే అనడం.. ఇలా ఏదో వివాదం తెరపైకి తెస్తుంది. ఇండియా పొరుగు దేశాలైన శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ లను తన వైపునకు తిప్పుకోవాలని చూడడం.. ఇలా ఒకటేమిటీ భారత్ ను దెబ్బతీయడానికి చైనా కుట్రలు తక్కువేమీ కాదు. భారత్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు ప్రపంచ వేదికలపై మద్దతు పలుకుతుంటుంది. అయితే ఇవన్నీ భారత్ తో డైరెక్ట్ గా చేయదు. వెనక నుంచి గోతులు తవ్వుతుంటుంది. ఎందుకంటే ఇప్పటి భారత్ 1962 ది కాదని.. దానికి బాగా తెలుసు. ఇప్పుడు భారత్ తో యుద్ధానికి దిగితే సిన్మా వేరే ఉంటుందని, అందుకే చాటుమాటు కుట్రలు పన్నుతుంటుంది.
ప్రపంచంలోనే రక్షణ, భద్రత విషయాల్లో పటిష్టమైన ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. సువిశాల దేశ రక్షణ.. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాల వల్ల రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీతో పాటు పలు దేశాలతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే భారత్ అణ్వస్త్ర దేశం కూడా. అధునాతన రక్షణ, భద్రతా పరమైన పరికరాలు, అణ్వస్త్ర క్షిపణులు, యుద్ధవిమానాలు..ఇలా అన్నింటిని సమకూర్చుకుంటోంది.
తాజాగా మొన్నటి రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇమాన్యుయేల్ తో పలు వ్యూహాత్మక ఒప్పందాలను ప్రధాని మోదీ కుదుర్చుకున్నారు. అందులో రక్షణ పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఎంతో ముఖ్యమైనది. అయితే వీటి వివరాలు బయటకు కనపడినా..ఇండియా, ఫ్రాన్స్ మధ్య ‘స్పేస్ వెపన్’(అంతరిక్ష రహస్య ఆయుధం) ఒప్పందం కూడా ఉందని చైనా ఆరోపిస్తుంది. స్పేస్ వెపన్ అంటే అణుబాంబును అంతరిక్షంలో దాచి.. శత్రు దేశాలతో యుద్ధం వచ్చినప్పుడు ప్రయోగించే టెక్నాలజీ. అయితే ఇది ఇప్పటికే అమెరికా, రష్యా లాంటి దేశాలు సీక్రెట్ గా చేశాయని .. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా వెళ్తోందని విమర్శిస్తోంది.
అయితే రహస్య ఆయుధంపై చైనా ఆరోపణలు ఎలా ఉన్నా.. ప్రపంచంలోని సంపన్న దేశాలతో భారత్ వివిధ ఒప్పందాలు కుదుర్చుకోవడం, రక్షణపరమైన సాంకేతికతను పెంచుకోవడం చైనాకు సుతారమూ ఇష్టం లేదు. అందుకే అనేక ఆరోపణలు చేస్తుంటుంది. అయితే దాని ఆరోపణలే భారత్ అంటే దానికెంత భయం ఉందో తెలియజేస్తున్నాయి.