India Alliance Meeting : నేడు ఇండియా కూటమి భేటీ
India Alliance Meeting : లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీకి 293 సీట్లు, కాంగ్రెస్ కు 233 సీట్లు వచ్చాయి. బీజేపీ స్వల్ప ఆధిక్యంతో మేజిక్ ఫిగర్ దాటింది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మరోవైపు ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెపుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా చర్చలు జరుపుతున్నాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఎన్డీయే కూటమి కీలక సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో తమతో కలిసొచ్చే నేతలతో భేటీ కానుంది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, చంపయ్ సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, డి. రాజా తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చించడంతో పాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం పాత మిత్రులైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ను సంప్రదించాలా.. వద్దా..? అనే విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. టీడీపీ, జేడీయూలు ఇప్పటికే ఇండియా కూటమిలో చేరికను తోసిపుచ్చాయి. ఎన్డీయేలోనే కొనసాగుతామని పేర్కొన్నాయి.