Godavari : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతంగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉపనదులు పొంగిపొర్లడంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో 50 అడుగు నీటిమట్టం నమోదయింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఇంద్రావతి, ప్రాణహిత ఉపనదుల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తోందని సమాచారం. ఎగువనున్న ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు చెందిన ఇరవై ఒక్క గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.