Vijayawada : ఈ రోజు నిర్వహించిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ పట్టణంలో 4 శాతం ఓటింగ్ పెరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదు కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 4 శాతం పోలింగ్ పెరిగి 83 శాతంగా నమోదైంది.
పోలింగ్ కేంద్రాల్లో యువతతో పాటు మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో కనిపించారు. దీంతో పార్టీలు పోలింగ్ సరళిని నిశితంగా గమనిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పట్టణంలో పెరిగిన ఓటింగ్ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓడిపోతున్నామని తెలిసి, ప్రజల్లో మద్దతు లేదని గ్రహించే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. టీడీపీ గెలుపు ఖాయమని, అందుకు నిదర్శనం వైసీపీ దాడులేనని అంటున్నారు.