JAISW News Telugu

PM Modi : విదేశాలలో ‘యోగా’కు పెరిగిన ఆదరణ.. 2015 తర్వాతనే ఈ మార్పు అన్న మోడీ..

PM Modi

PM Modi – International Yoga Day 2024

PM Modi : యోగాతో విదేశీయుల్లో సైతం మార్పు తెచ్చిందని, యోగాను అందరూ చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పదేళ్లుగా వరల్డ్ వైడ్ గా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. 2015లో యోగా గురించి ప్రస్తావించాక అప్పటి నుంచి మార్పు మొదలైందన్నారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)లో ఆయన పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌లో నివసించే 101 సంవత్సరాల మహిళ, యోగా గురువును ఈ ఏడాది (2024) భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించినట్లు మోడీ గుర్తు చేశారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినా.. యోగాపై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు తన జీవితాన్ని ధారపోసిందని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పారు. యోగాపై అనేక పరిశోధనా పత్రాలు ప్రచురించామని తెలిపారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమం అన్నారు. దీని ప్రాముఖ్యతను వివిధ దేశాధినేతలు అడిగి తెలుసుకున్నారని ఆయన వెల్లడించారు.

యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రాకతో కశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్‌ సరస్సు ఒడ్డున 7 వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం సాగలేదు. దీంతో వేదికను షేర్‌-ఏ-కశ్మీర్‌ సమావేశ కేంద్రంలోకి మార్చారు. ఫలితంగా కొంచెం ఆలస్యమైంది.

యోగా డేను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు, సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆసనాలు వేశారు. కేంద్ర మంత్రులు జైశంకర్‌, బీఎల్‌ వర్మ, ప్రహ్లాద్‌ జోషి, కిషన్‌ రెడ్డి, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్‌ రిజిజుతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ఆయా ప్రాంతాల్లోని వేడుకల్లో పాల్గొని యోగాపై అవగాహన కల్పించారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దేశ రాజధాని ఢిల్లీలోని యమునా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి ఆసనాలు వేస్తూ అవగాహన కల్పించారు. మరో మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా ఢిల్లీలోనే కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో సైనికుల నుంచి ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధ నౌకలో పని చేసే వారి వరకు అనేక చోట్ల యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యూయార్క్‌, టైమ్‌ స్క్వేర్‌ కూడలిలో వేలాది మంది ఆసనాలు వేసి యోగా డేను నిర్వహించుకున్నారు.

Exit mobile version