Telangana Official Symbol : తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా

Telangana Official Symbol
Telangana Official Symbol : తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా గీతాన్ని మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం అమల్లో అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనిపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించారు. కొన్ని నమూనాలు సిద్ధం చేశారు. మరిన్ని సలహాలు, సూచనలు కూడా స్వీకరించిన అనంతరం రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర గీతం మాత్రమే విడుదల చేయనున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు.