JAISW News Telugu

KCR : హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత

KCR

KCR

KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన పెట్టుకున్న రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో అవకతవకలు జరిగాయంటూ వాటిని నిగ్గు తేల్చేందుకు రేవంత్‌ సర్కార్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కమిషన్ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ సమయంలో తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, మరోమారు హాజరవుతానని కమిషన్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాకపోగా, విచారణ కమిషన్‌ తీరును తప్పుపడుతూ ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఆ తర్వాత అసలు కమిషన్ ఏర్పాటే చెల్లుబాటు కాదని, దానిని రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్  దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా విచారిస్తోందని, విచారణ పూర్తికాకుండానే మీడియా సమావేశం పెట్టి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని చెప్పిందంటూ ఆయన ఆరోపించారు. కేసీఆర్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తీర్పును రిజ్వర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనతో విభేదించిన కోర్టు కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని తెలిపింది.

Exit mobile version