Family Star : ఈ శుక్రవారం 4 సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’పైనే. ఇక ఈ సినిమాపై విజయ్ కూడా ఆశలు పెంచుకున్నాడు. తన కెరీర్ లో భారీ హిట్ చూసి చాలా రోజులైంది. లైగర్ అట్టర్ ప్లాప్ తర్వాత విజయ్ కెరీర్ కు చాలా నష్టం జరిగింది. ఫ్యాన్ బేస్ బాగానే ఉన్నా వరుసగా సినిమాలు ప్లాప్ అయితే ఏ హీరోకైనా కష్టమే. అందుకే ఈ సినిమా విజయ్ కెరీర్ కు ఎంతో సాయపడనుంది.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు పరశురామ్. గీతగోవిందం తర్వాత విజయ్, పరుశురామ్ కాంబోలో వస్తున్న మూవీ ఇది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ తోనే కుటుంబ ప్రేక్షకులకు గాలం వేశారు. ఫ్యామిలీ అంతా థియేటర్లకు వెళ్లే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. పైగా సమ్మర్ సీజన్. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాకు మించిన ఆప్షన్ మరేది లేదు.
ఇక మరికొన్ని గంటల్లోనే ఫ్యామిలీ స్టార్ బొమ్మ తెరపై పడబోతోంది. కుటుంబ సమేతంగా చూసే సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును ఫ్యామిలీ స్టార్ తీర్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తొలి మూడు రోజులు యూత్ తో నిండిపోయినా, ఆ తర్వాత మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. సో.. రన్ విషయంలో దిల్ రాజుకు కొండంత ధీమా ఉంది. సెన్సార్ రిపోర్ట్ కూడా ఫుల్ పాజిటివ్ గా ఉంది.
ఫస్టాఫ్ లో లవ్ స్టోరీ, సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారని టాక్. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, వాళ్ల మధ్య నడిపిన డ్రామా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సీన్స్ కూడా చాలా స్టైలీష్ గా తీర్చిదిద్దాడట పరశురామ్. ఇక పరశురామ్ అంటే వన్ లైనర్లు బాగానే పేలుతాయి. ఫ్యామిలీ స్టార్ లోనూ ఆ పంచ్ బాగానే వినిపించే చాన్స్ ఉంది. కాస్త ఆలస్యంగా బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అయినా సరే, స్పందన బాగుంది. నిజానికి ఏపీ, తెలంగాణలలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.