investigation : ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులను శిక్షించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను కోరుతున్నాడు. దాడి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో తెలియాలని కోరారు. దాడి తర్వాత పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి 2021లో పక్కదారి పట్టించారని లోకేశ్ గతంలో ఆరోపించారు.
ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో అసలు దోషులను శిక్షించేందుకు కేసు రీఓపెన్ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ కు చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు దోషులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది.
పోలీసుల విచారణ గురించి ముందుగానే తెలుసుకున్న పలువురు వైసీపీ నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ కేసును ఏపీ హైకోర్టు నేడు (జూలై 10) విచారించే అవకాశం ఉంది.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.
దేవినేని అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ స్పందిస్తూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనుబంధ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. దీనిపై అత్యవసర విచారణ జరిపించాలని కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు చెబుతున్నట్లు ఇది చిన్న విషయం కాదన్నారు. 2021లో అప్పటి అధికార పార్టీ ప్రోద్బలంతో వందలాది మంది టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు.