Farmers Loan Waiver : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీకి కట్టుబడి.. జూలై 18న లక్ష రూపాలయ వరకు అప్పులను మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 18వ తేదీ సాయంత్రం లోపు రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు సీఎం వెల్లడించారు.
రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఖాతాల్లో జమ చేయకుంటే బ్యాకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రైతుల రుణమాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపైనే ఉందని ఆదేశాలు జారీ చేసింది.
18వ తేదీ సాయంత్రంలోగా లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో రుణమాఫీ సంబరాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఆ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారని ప్రభుత్వం వెల్లడించింది.