Bhanupriya Meena : కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో బంజారాహిల్స్ లోని కవిత ఇంటికి చేరుకున్న 12 మంది ఈడీ ఆఫీసర్ల బృందం దాదాపు 4 గంటల పాటు కవితను ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు కవిత ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఆమెను ఎలా అరెస్ట్ చేయగలిగారంటూ కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. విచారణ ముగిసిందని, ఆమెను అరెస్ట్ చేస్తున్నామని ఈడీ అధికారి భానుప్రియా మీనా స్పష్టం చేశారని, ఇది సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా? అంటూ ప్రశ్నించారు.
ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం వచ్చి కవితను అరెస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మళ్లీ సోమవారం వరకు కోర్టులు అందుబాటులో ఉండవి తెలిసి ఈ అరెస్ట్ చేశారని ఆరోపించారు. సుప్రీం కోర్టులో ఈడీ అధికారులకు ఇబ్బందులు తప్పబోవని హెచ్చరించారు. ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన నిలదీశారు. దీనిపై ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనా కేటీఆర్ కు దీటుగా వాదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఎవరీ డేరింగ్, డాషింగ్ అధికారి అని నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.