Guntur : ఆరోగ్య బీమా పాలసీలో నామినీ పేరు సరి చేయకుండా రోజుల తరబడి తిప్పుతున్నారని విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి బ్రాంచి ఆపరేషన్స్ అడ్మిన్ ను కత్తితో పొడవడంతో పాటు వీరంగం సృష్టించారు. ఈ సంఘటన గుంటూరులో కలకలం రేపింది. గుంటూరులోని గోరంట్లకు చెందిన కందుల శ్రీనివాసరావు పెదకాకానిలోని గ్రామీణ నీటి సరఫరా పథకంలో వర్క్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. కేర్ ఆరోగ్య బీమాలో మూడేళ్ల కిందట ప్రమాద బీమా పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీపై వ్యక్తిగత రుణం తీసుకునేందుకు దరఖాస్తు చేశారు. అందులో నామినీగా భార్య లక్ష్మి పేరు పెట్టారు. పాలసీలో కందుల అని ఇంటి పేరు మాత్రమే ఉంది. భార్య లక్ష్మి పేరు నమోదవలేదు. ఇది సరిచేయాలని శ్రీనివాసరావు గుంటూరు అరండల్ పేటలో ఉన్న కేర్ ఆరోగ్య బీమా కార్యాలయానికి కొన్ని రోజులుగా వస్తున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కార్యాలయానికి శ్రీనివాసరావు వచ్చి బ్రాంచి ఆపరేషన్స్ అడ్మిషన్ పులిగడ్డ రాజేష్ ను సంప్రదించారు. పది రోజుల సమయం పడుతుందని రాజేష్ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదమేర్పడింది. ఆగ్రహంగా ఉన్న శ్రీనివాసరావు కార్యాలయం నుంచి బయటకు వచ్చి కత్తి తీసుకెళ్లి రాజేష్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో రాజేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. కత్తితో కార్యాలయంలో వీరంగం సృష్టించారు. ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. మేనేజర్ సింగంశెట్టి గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆవేశంతో అద్దాలు ధ్వంసం చేసే క్రమంలో శ్రీనివాసరావుకూ తీవ్ర గాయాలయ్యాయి. రాజేష్ ను, శ్రీనివాసరావును ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. అరంల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.