Gachibowli Meeting : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాదాపు 50 రోజుల వరకు జైలులో ఉన్నారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో హైకోర్ట్ బెయిల్ ఇవ్వగా.. మరో విచారణలో శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సడలింపులతో చంద్రబాబు నాయుడు ఈ నెల 29 నుంచి తన పార్టీ, రాజకీయ కార్యాచరణలో విస్తృతంగా పాల్గొనవచ్చు.
అయితే, జగన్ హయాంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, రాష్ట్రానికి మంచి చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ నేతలు ఆరోపించారు.. అయితే ఇటీవల బాబు విడుదల కావడంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల వరకు గడువు ఉండడంతో ఇప్పటి నుంచి వైసీపీ, టీడీపీ పోటా పోటీ కార్యక్రమాలను చేపడుతున్నాయి.
ఇందులో భాగంగా జగన్ పై అసంతృప్తితో ఉన్న నాయకులు, టీడీపీ శ్రేణులు ‘బాబు రావాలి-బాగు చేయాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలోకి గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ హాల్ లో శనివారం (నవంబర్ 25) భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఎజెండాగా జగన్ అరాచక పాలనపై ఈ సభ ఉండబోతోందని నిర్వాహకులు తెలిపారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. కోర్టు నిబంధనల మేరకు ఈ సభకు చంద్రబాబు నాయుడు రాకపోవచ్చని తెలుస్తోంది.