Australia : ఆస్ట్రేలియాలో పిల్లలు సోషల్ మీడియా ఫాలో కాకుండా ఆంక్షలు
Australia Children’s : ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించేందుకు తమ దేశంలో కొత్త చట్టం తీసుకుని రానుంది. ఈ విషయాన్ని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. టెక్ దిగ్గజాలు సోషల్ మీడియాలో వివిధ రకాల ఆన్లైన్ కంటెంట్లను విడుదల చేస్తున్నాయి. వయో పరిమితి కారణంగా వారు కంటెంట్‌కి జవాబుదారీగా ఉంటాయి. ఆస్ట్రేలియా ప్రవేశపెట్టబోయే కొత్త చట్టం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదే. ఎందుకంటే తప్పుడు సమాచారం చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. చిన్న పిల్లలు మానసిక పరిపక్వత లేకపోవడం వల్ల వారు వాటి ప్రభావానికి లోనవుతారు.
ఈ ఏడాది నవంబర్ 18న ప్రారంభమయ్యే రెండు వారాల సమావేశాల్లో ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆమోదం పొందిన 12 నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. 16 ఏళ్లలోపు వారు X, Tik Tok, Facebook, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని నియంత్రించడానికి ఒక ఏడాది పాటు సూచనలు, సలహాలు తీసుకుంటారు. కొత్త చట్టం ప్రకారం, సోషల్ మీడియాను 16ఏళ్ల లోపు పిల్లలు అనుసరించకుండా నిరోధించడానికి సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రభుత్వం జరిమానా విధిస్తుంది.