Telangana Govt : తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతున్నది. ఇక్కడి భక్తుల కోసం తిరుమల కొండపై ప్రత్యేక సత్రం నిర్మించాలని తెలలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ భక్తులకు తిరుమలలో సౌకర్యాలు కల్పించేలా, ఈ రాష్ట్రం నుంచి జారీ అయ్యే సిఫారసు లేఖలకు టీటీడీలో ప్రాధాన్యత లభించేలా చర్యలు చేపట్టాలని రేవంత్ సర్కారు భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీస్ అధికారులు, దేవాదాయ శాఖ ఇచ్చే సిఫారసు లేఖలకు తిరుమలలో ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లేవారిలో ప్రొటోకాల్ ఉన్నవారు మినహా ఇతరులు సామాన్య భక్తులుగానే పరిగణిస్తున్నారు. తెలంగాణ మంత్రులు, వీఐపీలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదు.
టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రతినిధికి అవకాశం కల్పిస్తున్నా రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉన్నది. టీటీడీ బోర్డులో రాష్ర్టానికి ఇస్తున్న ప్రాతినిథ్యం సరిపోవడం లేదనే భావన ఉన్నది. దీంతో రాష్ట్రం నుంచే వెళ్లే భక్తులకు కొంత ఇబ్బందులు తప్పడం లేదు. ఇందులో ప్రధానంగా ప్రత్యేక దర్శనం, వసతి సౌకర్యం కోసం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇచ్చే సిఫారసు లేఖలను అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. తిరుమల కొండపై తెలంగాణ సత్రాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వంతో చర్చించి అక్కడ స్థలాన్ని సమకూర్చుకోవాలని, తెలంగాణ భక్తులకు తిరుమలలో మెరుగైన సదుపాయాలు కల్పించేలా అక్కడ ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ఈ భేటీలో నిర్ణయించారు. అన్ని అనుకూలించి తెలంగాన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీలోని కొత్త ప్రభుత్వం సమ్మతి తెలిపితే వెంకన్న భక్తుల కష్టాలు కొంత వరకు తీరినట్లే. మరో రెండు రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇదంతా పూర్తయి రెండు ప్రభుత్వాలు, అధికారుల చర్చలు సఫలమవుతాయో లేదో మరికొద్ది రోజుల్లో తేలనుంది.