Congress Guarantees : అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అంచెలంచెలుగా నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 4) నిర్వహించిన కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇందులో మరో రెండు రెండు హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2 వాగ్ధానాల అమలుకు ఆర్థిక స్థితిగతులపై అంచనా వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కే ఎల్‌పీజీ సిలిండర్ అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ భేటీలోనే రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని సమ్మతి తెలిపినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో 2 హామీల అమలుకు సంబంధించి విధి విధానాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
5 గంటలకు పైగా సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల గురించి వారు విలేకరులకు తెలిపారు. రాష్ట్ర అధికారిక పేరును ‘TS’ నుంచి ‘TG’ గా మార్చాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించిందని చెప్పారు. ‘కొత్త వాహనాలను TG పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయని, ఇతర సంస్థల పేర్లు కూడా తదనుగుణంగా మారుస్తాం’ అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనకు పోరాడిన వారి మనోభావాలను గౌరవించని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘నియంతృత్వ పోకడల’ వల్ల పదేళ్లుగా రాష్ట్ర ఆత్మ గౌరవం మంటలో కలిసిందన్న మంత్రులు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నామకరణాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలోని 65 ఐటీఐలను అధునాతన శిక్షణా కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది, ఇందులో యువతకు తగిన శిక్షణ ఇవ్వాలని పరిశ్రమల డిమాండ్లకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెడతారన్నారు. తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపు, ఖైదీల విముక్తిపై కూడా సమావేశంలో చర్చించారు. ‘గత పాలనలోని దురహంకారానికి సంబంధించిన చిహ్నాలను ప్రక్షాళన చేయాలని, అవి తెలంగాణ ఆకాంక్షలను ప్రతిభింబించేలా ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది’ అని శ్రీధర్ బాబు చెప్పారు.
సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై చర్చించి, త్వరగా భర్తీ చేయాల్సిన పోస్టులను గుర్తించేందుకు కసరత్తు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వంలోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా కసరత్తు ప్రారంభించామని శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు తెలిపారు.