Dil Raju Warning To Media : సంక్రాంతి వచ్చిందంటే చాలు మన అందరికీ వినిపించే పేరు దిల్ రాజు. ప్రతీ సంక్రాంతికి ఎదో ఒక సినిమాతో ఆయన వచ్చేస్తూ ఉంటాడు. ఆయన నిర్మాణం లో తెరకెక్కని సినిమా వచ్చినా, రాకపోయినా, నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఎదో ఒక సినిమా రైట్స్ ని కొనుగోలు చేసి సంక్రాంతి రేస్ లో రెడీ గా ఉంటాడు. గడిచిన దశాబ్ద కాలం లో ఆయనకీ సంక్రాంతి పండుగ నాడు భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే, అది ‘అజ్ఞాతవాసి’ చిత్రం మాత్రమే.
ఈ సినిమా నైజాం ప్రాంతం హక్కులను భారీ రేట్ కి కొనుగోలు చేసాడు. చివరికి ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం తో భారీ గా నష్టపోయాడు. ఆ ఒక్క సినిమా తప్ప, మిగిలిన సంక్రాంతి సినిమాలు దిల్ రాజు కి కాసుల కనకవర్షం కురిపించాయి. ఈ ఏడాది ఆయన నైజాం ప్రాంతం లో ‘గుంటూరు కారం’, ‘నా సామి రంగ’ హక్కులను కొనుగోలు చేసాడు.
అయితే ‘గుంటూరు కారం’ విడుదలయ్యే జనవరి 12 వ తేదీన ‘హనుమాన్’ కూడా ఉండడం, ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా హనుమాన్ మేకర్స్ వెనక్కి వెళ్ళకపోవడం తో దిల్ రాజు ‘హనుమాన్’ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కుతున్నాడని సోషల్ మీడియా లో ఆయన పై ఒక రేంజ్ లో జనాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక హనుమాన్ నిర్మాత కూడా దిల్ రాజు వ్యవహరిస్తున్న వైఖరి పై అసంతృప్తి వ్యక్త పరిచాడు. ముఖ్యంగా జనవరి 12 వ తేదీన ‘గుంటూరు కారం’ చిత్రం హైదరాబాద్ సింగిల్ స్క్రీన్స్ ని 96 శాతం ఆక్రమిస్తే, ‘హనుమాన్’ చిత్రానికి కేవలం నాలుగు శాతం సింగల్ స్క్రీన్స్ ని మాత్రమే దక్కాయి. దిల్ రాజు ని కనీసం 10 థియేటర్స్ అయినా ‘హనుమాన్’ కి వదలమని కోరగా, ఆయన పట్టించుకోవట్లేదని టాక్.
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో దిల్ రాజు మీద పలు వెబ్ సైట్స్ ప్రచారం చేసిన నెగటివిటీ పై దిల్ రాజు విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘నా మీద సోషల్ మీడియా లో కొన్ని వెబ్ సైట్స్ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు, నన్ను విలన్ ని చేస్తున్నారు. నేను హనుమాన్ మేకర్స్ ని బెదిరించలేదు. తక్కువ థియేటర్స్ ఉన్నాయి, వేరే డేట్ లో రమ్మని మాత్రమే చెప్పాను. దీనిని వక్రీకరించి రాస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.