Vasantha Panchami : వసంత పంచమి వేళ సరస్వతీ మాతను పూజిస్తే.. ఎన్ని సత్ఫలితాలో..
Vasantha Panchami 2024 : పురాణాల ప్రకారం చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతీ పంచమి అని కూడా అంటారు. ఈ పర్వదినాన విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని చాలా మంది నమ్ముతారు. ఇవాళ వసంత పంచమి(ఫిబ్రవరి 14) సందర్భంగా పలు సరస్వతీ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా లక్షల అక్షరాభ్యాసాలు జరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలోనూ, ఉమ్మడి కర్నూలు జిల్లా కొలనుభారతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వసంత పంచమి రోజున సరస్వతీ మాతకే కాకుండా రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఒక్క రోజునే ముగ్గురు పూజలందుకుంటారు. ఇదే రోజున విష్ణుమూర్తికి కూడా పూజలు చేస్తారు. శ్రీ పంచమి రోజున సరస్వతీ దేవిని ఆరాధించే నియమాలను నారదుడికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతంలో ప్రస్తావించబడింది. అలాగే చిన్నారులకు సరస్వతీ ఆలయాల్లో అక్షరాభ్యాసాలు చేయిస్తారు.
మాఘమాసం శిశిర రుతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని పరిగణిస్తారు. రుతురాజు వసంతుడు కాబట్టి వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుడిని అనురాగవల్లి అయిన రతీదేవిని కూడా వసంత పంచమి రోజే పూజించడం జరుగుతుంది. ఈ ముగ్గురిని ఒకేసారి ఆరాధించడం వల్ల మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు.
ఈ రోజున పవిత్ర గ్రంథాలను సరస్వతీ దేవి విగ్రహం దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు సరస్వతీ దేవి పుట్టిన రోజు కనుక ఆమెను సేవిస్తే తల్లి అనుగ్రహం పొందవచ్చని భక్తులు భావిస్తారు. ఈ రోజు ఏదైనా శుభకార్యం చేసేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. కొత్త పనులు ప్రారంభించేందుకు, ఖరీదైన వస్తువులు కొనేందుకు శుభ సమయంగా పరిగణిస్తారు.
ఈ రోజు చంద్ర, గురు, శుక్ర, బుధ గ్రహదోషాలు ఉన్నవారు పూజలు చేయడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఈ పర్వదినాన సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. వివాహితులు ఈ రోజు బ్రహ్మచార్యం పాటించారు. ఇలా చేస్తే సరస్వతీ దేవి ఆశీస్సులు పొందడమే కాదు కోరికలన్నీ నెరవేరుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారని వేదపండితులు చెప్పారు.