CM Appointment : సీఎంను కలవాలంటే ఈ నెంబర్ లో అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందే..!!
CM Appointment : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అయితే.. పెద్ద సంఖ్యలో వారు వస్తుండడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యలు చెప్పుకునే వారు వందల్లో ఉంటే.. వినేవారు మాత్రం ఒక్క చంద్రబాబు మాత్రమే. దీంతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను పార్టీ నేతలు ప్రకటించారు.
చంద్రబాబును కలిసేందుకు..
సీఎం ప్రతీ శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ పార్టీ నాయకులతో పాటు ఇతరులు ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకొనేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వందలాది మంది బాబును చుట్టుముట్టి వినతి పత్రాలు ఇస్తుండడంతో సీఎం కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయననుపై అంతస్తుకు తీసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది కొంత మంది సందర్శకులను తీసుకొని వెళ్లింది.
టోల్ ఫ్రీ నెంబర్ ఇదే..
తోపులాటలో ఇబ్బంది పడ్డామని మహిళలు సీఎం దృష్టికి తెచ్చారు. వారి ఆవేదనను గుర్తించిన చంద్రబాబు ఓపిక పట్టాలని కోరారు. దీనిని దగ్గరగా ఉండి చూసిన టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు ఒక కీలక ప్రకటన చేశారు. ఇకపై సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించుకొనేవారు టోల్ ఫ్రీ నెంబర్ 7306299999లో సంప్రదించాలని సూచించారు. వారి ఫిర్యాదులను పరిశీలించి, ప్రాధాన్యతా క్రమంలో అనుమతిస్తామని వెల్లడించారు. ప్రతీ వారం 500 మందిని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
వినతులకు ప్రాధాన్యత..
కొత్త ప్రభుత్వం కావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరి కొందరు సమస్యలు చెప్పుకుంటున్నారు. అందులో బాబుతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నం చేస్తారు. వీరి కారణంగా కూడా అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు నిరీక్షించాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన పార్టీ యంత్రాంగం టోల్ ఫ్రీ నెం. ద్వారా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అప్పుడు తోపులాటలు, గుంపులు ఉండవని, వారికి వచ్చిన రోజు సమయంలో వస్తే సీఎంను కలిసే వీలు సులువుగా లభిస్తుందని, ఈ విధానం అమలుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు కూడా చేసినట్లు పేర్కొన్నారు.