Indian Temples : భారత్ లోని ఒక్కొక్క ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఇవి భక్తులకు ఇలవేల్పుగా ఉంటూ..తమ కోరుకున్న నెరవేర్చినవిగా కొందరు నమ్ముతారు. హైదరాబాద్ కు దగ్గరలోని చిలుకూరు బాలాజీని దర్శించుకుంటే అమెరికా వీసా వస్తుందని నమ్మేవారు. అందుకే అక్కడ ఇప్పటికీ ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, విదేశాలకు వెళ్లాలనుకునేవారు, ముఖ్యంగా యువత అక్కడ మొక్కులు చెల్లిస్తూ కనిపిస్తుంటారు. ఇలాంటి రకరకాల ప్రత్యేకతలతో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.
ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు భారత్ లోని ఓ ఆలయంలో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 2015లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న టైంలో ఆయనను కలిసిన మార్క్ జుకర్ బర్గ్ ..తనకు భారత్ లో ప్రత్యేక అనుబంధం ఉన్న ఆలయం గురించి స్వయంగా మోదీతో చెప్పారు.
దివంగత యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సలహా మేరకు ఫేస్ బుక్ ప్రారంభ రోజుల్లో భారత్ లోని ఒక ఆలయాన్ని తాను సందర్శించానని.. ఆ ఆలయ సందర్శన తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న మార్పుల గురించి జుకర్ బర్గ్ ..మోదీతో చెప్పారు.
జుకర్ బర్గ్ సందర్శించిన ఆ ఆలయం ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో ఉంది. అదే కైంచి ధామ్ ఆశ్రమం. స్టీవ్ జాబ్స్ కూడా ఈ ఆలయాన్ని 1970లలో సందర్శించారు. కైంచి ధామ్ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాతే యాపిల్ కంపెనీ పెట్టడంపై దృష్టి పెట్టారని చెబుతారు. కైంచిధామ్ నైనిటాల్ లో ఉన్న బాబా నీమ్ కరౌలి ఆశ్రమం. ఇది హనుమాన్ దేవాలయ ఆశ్రమం. దీన్ని 1960ల్లో నీమ్ కరోలి బాబా నిర్మించారు. ఈ ఆశ్రమం చుట్టు కొండలు, చెట్లు, నది ఉన్నాయి. 1973లో బాబా మరణించారు. కానీ నేటికీ చాలా మంది ఉన్నత స్థాయి అమెరికన్లు కూడా ఆయనను విశ్వసిస్తారు.
ప్రతీ ఏడాది జూన్ 15న ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ సమయంలో దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. స్టీవ్ సలహా ప్రకారం జుకర్ బర్గ్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు ఆ ఆలయంలోనే బస చేశానని జుకర్ బర్గ్ మోదీతో చెప్పారు. ఇది తనకెప్పుడూ ప్రత్యేకమేనని చెప్పుకొచ్చారు.