Small teams : టీ20 ప్రపంచకప్ 2024 క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న జట్లను తేలిగ్గా తీసుకుంటే పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి ఔరా అనిపించాయి. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే పలానా జట్లు సూపర్-8లోకి చేరుతాయని పందెలు కాశారు. అనూహ్యంగా ఏ మాత్రం అంచనాలు లేని జట్లు సూపర్-8లోకి సంచలనం సృష్టించాయి. లీగ్ దశలోనే న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి జట్లు నిష్ర్కమించగా, అనూహ్య విజయాలతో రెండు జట్లు తొలిసారి ఓ మెగా టోర్నీలో రెండో రౌండ్ కు చేరి, ఆశ్చర్యపరిచాయి. అవే అఫ్గానిస్థాన్, అమెరికా జట్లు.
కివీస్ అనూహ్యంగా..
ఈ టోర్నీలో లీగ్ దశలోనే పాకిస్థాన్, శ్రీలంక లాంటి జట్లు నిష్క్రమించడం కంటే న్యూజిలాండ్ ఎలిమినేట్ కావడం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. ఐసీసీ టోర్నీ అనగానే పూనకం వచ్చినట్లు జోరు చూపే కీవిస్ జట్టు ఈసారి అనూహ్యంగా చతికిలబడిపోయింది. ప్రపంచకప్‌లో ఎంతో బలమైన రికార్డు ఉన్న న్యూజిలాండ్ జట్టు తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. టోర్నీ ఏదైనా కనీసం నాకౌట్‌కు వెళ్లే న్యూజిలాండ్ ఈసారి పసికూన జట్టను తలపించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచే ఇందుకు ఉదాహరణ. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్ తనకంటే బలహీనంగా అఫ్గాన్ చేతిలో 75 పరుగులకు ఆలౌటై ఆ పై ఓడిపోవడం ఈ టోర్నీలోనే సంచలనం. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే తగిలిన దెబ్బ కీవిస్ ను కోలుకోలేకుండా చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ చేతిలోనూ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించినా.. ఆఖర్లో చేతులెత్తేసి ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆ జట్టును ముంచేసింది. రుథర్‌ఫర్డ్ ప్రతి బంతిని బాదేసి విండీస్‌కు పోరాడే స్కోరును సాధించిపెట్టాడు. ఆ తర్వాత కరీబియన్ జట్టు తెలివిగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ కు అడ్డుకట్ట వేసింది. ఈ ఓటమే ఆ జట్టుకు సూపర్-8 అవకాశాలు లేకుండా చేసింది. కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో తన ముద్ర వేస్తూ వస్తున్న అఫ్గాన్.. ఓ పెద్ద టోర్నీలో తొలిసారి రెండో రౌండ్లోకి దూసుకెళ్లి తన సత్తా చాటుకుంది.
శ్రీలంక.. పాక్ కూడా అంతే..
సంచలనాలకు మారుపేరైన పాకిస్థాన్‌తో పాటు అంతో ఇంతో బలమైన జట్టుగా ముద్ర వేసుకున్న శ్రీలంక కూడా తొలి రౌండ్ లోనే నిష్క్రమించడం నిజంగా షాకే. ఆతిథ్య జట్టు అమెరికా చేతిలో ఓడిపోయి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. ఆ తర్వాత తన చిరకాల ప్రత్యర్థి భారత్‌కు తలొగ్గి టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలను తనకు తానే దెబ్బ తీసుకుంది. ఆ తర్వాత కెనడాపై గెలిచి అవకాశాలను సజీవంగా ఉంచుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు. కానీ అమెరికా-ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అమెరికా అడుగు ముందకు వేసి పాకిస్తాన్ ను భారీ దెబ్బ కొట్టింది. దీంతో తొలి రౌండ్లోనే పాక్ ఇంటిముఖం పట్టక తప్పలేదు.
శ్రీలంక కూడా కూడా పాక్ మాదిరిగానే ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. మొదట దక్షిణాఫ్రికా, తర్వాత బంగ్లాదేశ్ చేతిలో ఓటమి శ్రీలకం జట్టు సూపర్-8 అవకాశాలకు గండికొట్టింది. ఆ తర్వాత నేపాల్‌తో పోరు వర్షం కారణంగా రద్దవడంతో లంక ఆశలు అడియాశలయ్యాయి. ప్రధానంగా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. దక్షిణాఫ్రికాపై 77 పరుగులకే ఆలౌటైన శ్రీలంక.. బంగ్లాపై 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ వైఫల్యం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఇక ఈ టోర్నీలో తొలి రౌండ్ నుంచి ముందుకు వెళ్లలేకపోయినా పపువా న్యూగినీ, నేపాల్ జట్లు తాము తక్కువేం కాదని నిరూపించకున్నాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా లాంటి బలమైన జట్టు చేతిలో నేపాల్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడి తన సత్తా ఏంటో చాటుకుంది. మున్ముందు టోర్నీల్లో ఈ కూనలతో పెద్ద జట్లు అప్రమత్తంగా ఉండక తప్పదని టీ20 వరల్డ్ కప్-2024 ద్వారా నిరూపితమైంది.