Vadapav : వడాపావ్ కోసం ఆగితే.. రూ.లక్షల ఆభరణాలు పోయాయి..
vadapav : వడాపావ్ కోసం దుకాణం వద్ద ఆగిన ఓ వృద్ధ జంట రూ.5 లక్షల విలువైన ఆభరణాలు పోగొట్టుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళల మెడల నుంచి బంగారు గొలుసులను దొంగలు లాక్కెళ్లడం తరచూ జరుగుతుందే. కానీ, తాజాగా ఓ వృద్ధ దంపతుల వద్దనున్న రూ.5 లక్షల విలువైన నగలను చోరీ చేశారు. వడాపావ్ తినేందుకు షాప్ వద్ద ఆగగా.. ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన పుణెలో జరిగింది.
వృద్ద దంపతులు బ్యాంకుకు వెళ్లి నగలు తీసుకొని తమ స్కూటర్ పై వస్తున్నారు. ఈ క్రమంలోనే వడాపావ్ తినేందుకు ఓ దుకాణం వద్ద ఆగారు. భర్త షాప్ లోకి వెళ్లగా, మహిళ ద్విచక్ర వాహనం వద్ద ఉంది. వీరిని ఇద్దరు దుండగులు గమనించి అనుసరిస్తూ వస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించిన ఆమె దగ్గరికి వెళ్లి మీ వస్తువు కింద పడిందంటూ ఆమె దృష్టిని మళ్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె దానికోసం వెతుకుతుండగా, స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్ ను తీసుకొని మరో వ్యక్తి పరారయ్యాడు. గమనించిన మహిళ కేకలు వేస్తూ బ్యాగ్ ఎత్తుకెళ్లిన వ్యక్తి వెనక పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.