Lift in KCR Bus : తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో గెలిచి తమ ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులను నేరుగా కలిసేందుకు బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం చుట్టేస్తున్నారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులను పరామర్శిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తరువాత కాలు జారి పడి తుంటి విరగడంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మెల్లగా కదులుతూ అన్నదాతలను కలిసి ఓదారుస్తూ తిరుగుతున్నారు. దీంతో కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బస్సు పైకి ఎక్కి మాట్లాడటం కష్టంగా మారింది. దీనికి బస్సులోనే లిఫ్ట్ ఏర్పాటు చేశారు. బటన్ నొక్కితే లిఫ్ట్ బస్సుపైకి తీసుకెళ్తుంది. మాట్లాడిన తరువాత మళ్లీ కిందకు తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రోడ్ షోలలో కేసీఆర్ బస్సు పైకి వచ్చి మాట్లాడి మళ్లీ కిందకు వెళ్తున్నారు. బస్సులో అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానంతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతులు ఇప్పుడు ఎలా గుర్తొచ్చారని పలువురు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో అంటున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న పర్యటనతో పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి ఇందులో కూడా ఓటమి పాలైతే ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. పార్టీకి జవసత్వాలు నింపాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో మమేకం కావాలని చూస్తున్నారు.
తెలంగాణలో బస్సు యాత్ర సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నారు. పోయిన ప్రతిష్టను తిరిగి తీసుకొచ్చే క్రమంలో కేసీఆర్ పలు వ్యూహాలు రచిస్తున్నా అవి సక్సెస్ కావడం లేదు. బస్సు యాత్ర ఏ మేరకు వారిని ఆదుకుంటుందో చూడాల్సిందే మరి. మునిగిపోతున్న నావకు దిక్సూచి అవుతారా? దిక్కు లేకుండా పోతారా? అనేది తేలాల్సి ఉంది.