Janasena : ఈ టైంలో పార్టీ వీడితే..రెంటికి చెడ్డ రేవడే అవుతారు..
Janasena : ఏపీలో ఎటు చూసినా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పుడిదే కొత్త పంచాయితీలకు తెరతీస్తున్నాయి. మూడు పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. ముఖ్యంగా జనసేనలో అసమ్మతి కాస్తా ఎక్కువగానే కనిపిస్తోంది. జనసేనలో సీట్లు దక్కనివారు బహిరంగంగానే తమ ఆక్రోషాన్ని వెల్లగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు టికెట్ దక్కడంలేదని వారు ఆరోపిస్తున్నారు. పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ టికెట్ దక్కకపోవడంతో కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దం సమయాన్ని, ధనాన్ని వెచ్చించానని, తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. ఇప్పటికే పరుచూరి భాస్కరరావు జనసేన నుంచి బయటకు వచ్చేశారు.
తాజాగా మరో కీలక నేత జనసేన పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది. జనసేన కీలక నేతల్లో పితాని బాలకృష్ణ కూడా ఒకరు. ఆయన గత ఎన్నికల్లో ముమ్మడివరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీకి చెందిన దాట్ల బుచ్చిబాబును అభ్యర్థిగా ఖరారు చేశారు. పవన్ తనను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని పితాని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన జనసేనను వీడాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో చేరడానికి మిథున్ రెడ్డితో గురువారం భేటీ అయ్యారు. ఈనెల 30న జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.
కాగా, ప్రతీ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు సాధారణమే. సీట్లు రాని వారు ఆగ్రహంతో ఇతర పార్టీల్లో చేరడం..అక్కడ వారికి సరైన ప్రాధాన్యం దక్కక రెంటికి చెడ్డ రేవడి మారుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనకు వచ్చిందే 21 సీట్లు అందులో వివిధ సమీకరణాల ప్రకారం సీట్లు కేటాయించారు. పార్టీలో సీనియర్ నేతలకు కొందరికీ అవకాశం రాకపోవచ్చు. కానీ పార్టీ సత్తా చాటే సమయం ఇది. పార్టీ తాను అనుకున్నది సాధిస్తే..మరెన్నో అవకాశాలు వస్తాయి. అందుకే నేతలు ఓపిక, సహనం అలవర్చుకోవాలని పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రానివారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని జనసేన బాధ్యులు సూచిస్తున్నారు.