EV Automatic Charging : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల శకం నడుస్తోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇక గుడ్ బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరో ఐదేండ్లలో ఈవీ వెహికల్స్ తప్ప ఇతర వాహనాలకు డిమాండ్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొన్ని సంవత్సరాలు ముందుకెళ్తే పెట్రోల్ బంకులు మూతపడే అవకాశాలు లేకపోలేదు. ఆ ప్లేస్ లో ఎలక్ట్రిక్ చార్జింగ్ బంకులు రానున్నాయి. ఇవే కాదు ఈవీ వాహనాల సంఖ్యలో పెరిగే డిమాండ్ కు బంకులు కూడా సరిపోవు.
సాంప్రదాయ వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఎంత అవసరమో.. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ అంత అవసరం. ఎలక్ట్రిక్ వాహనం ఏదైనా సరే చార్జింగ్ లేనిదే బయటకు వెళ్లలేం. ఇందుకోసం ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి. కానీ ఎలక్ట్రిక్ కారు లేదా స్కూటర్ బ్యాటరీ ఫుల్‌గా ఛార్జ్ అవ్వాలంటే కనీసం గంట సేపైనా చార్జింగ్ పెట్టాల్సిందే. అప్పటిదాగా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది.
అయితే ఆ అవసరం లేకుండా మనం వెళ్తున్న రోడ్డుపైనే చార్జింగ్ సదుపాయం ఉంటే.. మనం ఎలక్ట్రిక్ కారులో వెళ్తున్నంత సేపూ కారుకు చార్జింగ్ అవుతూ ఉంటే.. ఊహించడానికే అద్భుత ఆలోచన కదా. కానీ దీన్ని నిజం చేశారు అమెరికా వాళ్లు. మిచిగాన్‌లోని డెట్రాయిట్ నగరంలో మొట్టమొదటి వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్‌ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఈవీ టెక్నాలజీలో కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. డెట్రాయిట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్ ద్వారా.. ఈ రోడ్డుపై ఎలక్ట్రిక్ వాహనాలు కదులుతున్నప్పుడు వాటికి శక్తి సరఫరా అవుతుంది. ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ వైర్‌లెస్ స్ట్రీట్‌ను రూపొందించారు. ఈ ఆవిష్కరణతో.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఫ్యూయెల్‌తో నడిచే వాహనాలు కనుమరుగవుతాయని ఆటోమొబైల్ రంగ ఎక్స్ పర్ట్ భావిస్తున్నారు.
ఈ ఎలక్ట్రిక్ వైర్‌లెస్ రోడ్ల ఉపరితలం కింద విద్యుదయస్కాంత కాయిల్స్‌ను అమర్చారు. ఈ కాయిల్స్ ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా చార్జ్ చేయగల అధునాతన వ్యవస్థను కలిగి ఉంటాయి. తద్వారా ఈవీలు ఈ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రత్యేక రిసీవర్ ఉన్న వాహన బ్యాటరీ చార్జ్ అవుతుంది. దీని ద్వారా వాహనదారులు చార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా మార్గమధ్యలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందమేనని వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాహనదారులు ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ ఎలక్ట్రిక్ వైర్‌లెస్ స్ట్రీట్లను నిర్మించారు. అయితే వీటి ద్వారా చార్జింగ్ సమస్య పరిష్కారం అయినప్పటికీ ఇందులోనూ కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఖర్చు.
అమెరికాలో డెట్రాయిట్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ వైర్‌లెస్ స్ట్రీట్ రోడ్ నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు దాదారు 2 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీని విలువ రూ.16,60,54,000. ఏదేమైనా ఈ సరికొత్త ప్రాజెక్ట్ ద్వారా మిచిగాన్ నగరం.. భవిష్యత్తు లక్ష్యాలకు ఆదర్శంగా నిలుస్తుంది. 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించడమే ఈ వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్డు ప్రధాన లక్ష్యం. అయితే కాలక్రమంలో ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉంది. ఆవిష్కరణలు ఎక్కువైన కొద్ది ఖర్చు తగ్గుతుందని మనకు తెలిసిందే. మొత్తానికైతే ఈవీ వాహనాల చార్జింగ్ కష్టాలు తీరడం మాత్రం ఆనందించదగ్గదే.