Viral Video : ఓటు వేయకుంటే మీ పరిస్థితి ఇలాగే ఉంటది.. వైరల్ వీడియో..

Viral Video

Viral Video

Viral Video : దేశంలో ఎటు చూసినా సార్వత్రిక ఎన్నికల సందడే కనిపిస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. 400 సీట్లు గెలవాలని క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో మోదీని గద్దె దించాల్సిందేనన్న పట్టుదలతో ఇండియా కూటమి నేతలు ఉన్నారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఓ దశ ఎన్నికలు పూర్తికాగా, రేపు మరో దశ ఎన్నికలు జరుగనున్నాయి. తుది విడత జూన్ 1న నిర్వహించనున్నారు. జూన్ 4 ఫలితాలు ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనైనా ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏ ఒక్క దానిలో కూడా 65 శాతానికి పైగా ఓటింగ్ జరుగలేదు. వందకు సుమారు 65 మందే ఓటు వేస్తుండడంతో ప్రజాస్వామ్య క్రతువు సరిగ్గా పూర్తికానట్టే అని చెప్పవచ్చు. ఓటు వేసిన వారిలో మెజార్టీ ఓట్లు సాధించిన వారినే విజేతగా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పటికే దేశంలో ఓటింగ్ శాతం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామిక వాదులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈక్రమంలో సోషల్ మీడియాలో వీడియోలు, మీమ్స్, ఆర్టికల్స్ ద్వారా ఓటు ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతీ పౌరుడు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. నేనొక్కడినే ఓటు వేయకుంటే ఏమవుతుందిలే అనుకుంటే..ప్రజాస్వామ్యానికి ఎంత నష్టం జరుగుతుందో వివరిస్తున్నారు.

చదువుకున్న వారు, మేధావులు ఓటు వేయకుంటే గూండాలు, కబ్జాకోరులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మిమ్మల్నే పాలిస్తారని అవగాహన కల్పిస్తున్నారు. ఇదే విషయమై ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎన్నికల నాడు ఓటు వేయక గైర్హజరు అయితే ఎంత నష్టమో ఆ వీడియో చూసి అర్థమవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఇద్దరు విద్యార్థులను బయట గోడ కూర్చి వేయిస్తాడు ఆ క్లాస్ లీడర్. దీంతో ఆ ఇద్దరు బాలురు మాట్లాడుకుంటూ..‘‘క్లాస్ లీడర్ ఎన్నిక రోజు మనదిద్దరం ఆబ్సెంట్ అయ్యాం. వాడు లీడర్ అయిపోయాడు..మనల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు’’ అనుకుంటూ బాధపడుతూ గోడ కూర్చి వేస్తారు. ఈ పిల్లల్లాగే దేశ పౌరులు కూడా ఎన్నికల నాడు ఓటు వేయకపోతే  గూండాలు ఎన్నికల్లో నిలిచి గెలిచి మనల్ని నానా కష్టాలు పెడుతారు. అందుకే ప్రతీ ఒక్కరూ దేశ ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొనాలి. ఓటు వేయాలి. ఓటే మన ఆయుధమని గుర్తించాలి.

TAGS