హీరోయిన్లుగా కెరీర్ ను సుదీర్ఘకాలం రాణించాలంటే కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. కొందరు హీరోయిన్లు మాత్రం మరీ నాలుగైదు సినిమాలకే పరిమితమవుతారు. అందులోను అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించారంటే త్వరలోనే వారంతా ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతారంటూ వార్తలు వస్తుంటాయి. అందుకు తగ్గట్లుగానే కొందరు హీరోయిన్లు అల్లు అర్జున్ సరసన నటించి సినీ పరిశ్రమ నుంచి మూటా ముల్లె సర్దుకొని వెళ్లిపోయారు.
ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుమెహతా.. తర్వాత నువ్వంటే నాకిష్టం సినిమా చేసి కనిపించకుండా పోయింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు చిత్రంలో భానుశ్రీ మెహ్రా హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ ఎంపికపై తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ ఈ చిత్రం విడుదలైన తర్వాత ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత తెలుగులో ఎక్కడా కనపడలేదు. పరుగు చిత్రంలో హీరోయిన్ గా నటించారు షీలా కౌర్. ఆ సినిమా ఆడిన తర్వాత తారక్ పక్కన అదుర్స్ లో కూడా నటించింది. అయినా పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది.
అల్లు అర్జున్ మరో చిత్రం బన్నీ. ఈ సినిమా హిట్ అయినప్పటికీ అందులో నటించిన గౌరీ ముంజల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. టాలీవుడ్ కు దూరమైంది. అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రిలో అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించి విజయాన్ని అందుకున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. వేదం సినిమాలో దీక్షాసేథ్ నటించింది. ఆమెకూడా అంతే.. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. ఇలా బన్నీ సరసన నటించి నిలదొక్కుకున్నవారు అతి తక్కువమందే ఉన్నారని చెప్పొచ్చు.