KTR : బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా చాలా పథకాలు అందించినా ఆ ప్రాంతంలో ప్రజలు తమను ఎందుకు పక్కన పెట్టారని కేటీఆర్ నాయకులు, కార్యకర్తలను ప్రశ్నించారు. వీటిపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం (జనవరి 11) రోజున మహబూబాబాద్ లోక్ సభ నియోజవకర్గ సన్నాహాక సమాశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అస్సలు అనుకోలేదు.. అందుకే ఇష్టా రీతిన హామీలు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.
హస్తం పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజల కోసం గొప్పగా పని చేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రత్యర్థులు విమర్శలు చేస్తే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 6,47,479 ఇచ్చినట్లు ఆయన చెప్పారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు, 73 శాతం సాలరీలు పెంచిన నాయకుడు కేసీఆర్ అన్నారు. 29 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచినది కూడా బీఆర్ఎస్ అన్నారు. ఇలాంటివి అనేకం పార్టీ చేసిందని వీటిని ప్రచారంలో అస్త్రాలుగా సంధించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. సొంత పనులను పక్కన బెట్టి ప్రచారం మీద ఫోకస్ చేస్తే గెలిచే వాళ్లమని వ్యాఖ్యానించారు.
వందలాది సంక్షేమ కార్యక్రమాల్లో ఎప్పుడూ ప్రజలను లైన్ లో నిలబెట్టని ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. అన్నీ ప్రజల కోసం చేశామే తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. ప్రజలు ఇప్పటికీ తమను తిరస్కరించలేదన్న కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మూడు వంతుల ఓట్లను పార్లమెంట్ కు వినియోగించుకోవడంలో సక్సెస్ కావాలని కోరారు. ఇప్పటికీ స్థానిక సంస్థల బలం ఉందని కేటీఆర్ అన్నారు. దీనికి నాయకులు, కార్యకర్తలు స్పందిస్తూ పార్టీ సమావేశాలను విస్తృతం చేస్తామని, అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.