Video Viral : ఎన్నికల ముందు ఈ వీడియో బయటకొస్తే..వైసీపీకి ఒక్క ఓటు పడేదికాదు.. వీడియో వైరల్

Video Viral

Video Viral

Video Viral : తెలుగు మీడియా చూపించని తెగువ ఓ హిందీ చానల్ చూపించింది. రెండు రోజుల కిందట ‘కేకే క్రియేట్’ అనే హిందీ యూట్యూబ్ చానల్ అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎవరూ చేయలేని సాహసాన్ని చేసింది. అమరావతిపై ఏ తెలుగు మీడియా చేయని వీడియో తీసి దేశ ప్రజలకు అమరావతిపై కుట్ర జరిగిన విషయాన్ని దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించింది. అమరావతిలో చంద్రబాబు హయాంలో నిర్మించిన అనేక కట్టడాలను జనాలకు పరిచయం చేసింది. ఒక్క వ్యక్తి ఇగో వల్ల అద్భుతమైన రాజధానిని పక్కనపెట్టిన సంగతిని కుల్లంకుల్లా నిజాలతో వెల్లడించింది.

ప్రపంచంలోనే అద్భుత రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పూనుకున్నారని, దానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్మించేందుకు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని ఆ చానల్ తెలిపింది. చంద్రబాబు ప్రయత్నాన్ని జగన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తే ఏపీకి అద్భుత రాజధాని కల సాకరమయ్యేదని సునిశిత విమర్శలు చేసింది. ఈ వీడియో కనుక ఎన్నికల ముందు బయటకొస్తే జగన్ రెడ్డి పార్టీకి ఒక్కటంటే ఒక్క ఓటు పడేది కాదని ఆ వీడియో చూసిన వాళ్లు అంటున్నారు.

అమరావతికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు:

2014 లో ఎన్నికైన టీడీపీ ప్రభుత్వం, ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా మార్చాలని తలపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కీర్తి, గొప్ప సంస్కృతి, చారిత్రక, మతపరమైన సంపదను ప్రోత్సహించాలని భావించింది. సింగపూర్ కంపెనీ రాజధానీ నగరాన్ని రూపొందించింది. నగరాన్ని అభివృద్ధి చేయడానికి రెండు ప్రభుత్వాల సహకారంతో సింగపూర్ ప్రభుత్వం నియమించిన ఇద్దరు కన్సల్టెంట్‌లు, ఇతర అంతర్జాతీయ కన్సల్టెంట్లు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశారు.

అప్పటి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నగరానికి శంకుస్థాపన చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ రాజధాని నగరాన్ని కృష్ణా నది ఒడ్డున బంగాళాఖాతం నుంచి సుమారు 60 కి.మీ. దూరంలో ఉన్న గొప్ప సారవంతమైన భూమిలో నిర్మించ తలపెట్టారు. నగరంలో 51% పచ్చని ప్రదేశాలు, 10% నీటి వనరులను కలిగి ఉండేలా రూపొందించారు. ఈ కొత్త నదీతీర రాజధాని కోసం రైతుల నుంచి విశిష్టమైన సాగు భూమిని సమీకరించింది.

దేశంలోనే తొలిసారిగా గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు అమరావతి కోసం భూ సమీకరణ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. ఇది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రపంచ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లతో దాదాపు రూ. 17,500 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటితో పాటు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, పెట్టుబడులు, బాండ్లు, లీజు అద్దె రాయితీల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించాలని ప్రణాళిక వేసింది. సరికొత్త రాజధాని నగరానికి రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. భారత ప్రభుత్వం 2,500 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. భవిష్యత్తులో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.

కానీ, గత ప్రభుత్వం అమరావతిలోని అనేక ఆస్తులపై సమాచార దుర్వినియోగానికి, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని పేర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వం, APCRDA, ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) లు మద్దతు ఇచ్చిన భారీ ప్రాజెక్టులు, ఒప్పందాలను నిలిపివేసింది. వాటిని సమీక్షించేందుకు ప్రభుత్వం అనేక కమిటీలను నియమించింది. దాంతో అమరావతిలో ప్రైవేట్ సంస్థలు చేపట్టిన పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతుండగా.. ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ పనులు, రహదారి పనులు పూర్తిగా ఆగిపోయాయి.

2019 నుంచి ప్రస్తుతం..

2019 జూలైలో, ప్రపంచ బ్యాంకు $300 మిలియన్ల అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల సహాయాన్ని రద్దు చేసింది. ‘‘అమరావతి ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం చేసిన అభ్యర్థనను భారతదేశం ఉపసంహరించుకుంది’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు తర్వాత, బీజింగ్‌కు చెందిన ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కూడా అమరావతి రాజధాని నగర ప్రాజెక్టుకు $200 మిలియన్ల నిధులను ఉపసంహరించుకుంది. దాంతో అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడింది.

2019 నవంబరులో, అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్‌లతో కూడిన సింగపూర్ కన్సార్టియం రాజధాని నగరం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇతర ప్రాధాన్యతల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును కొనసాగించకూడదని నిర్ణయించుకోవడంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.  గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరాన్ని నిర్మించడానికి అమరావతి ప్రాంతం అనుకూలంగా లేదని, అది వరదలకు గురయ్యే అవకాశం ఉందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది.

2019 డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించింది. కోస్తా ఆంధ్రలో అమరావతి, రాష్ట్ర శాసనసభతో శాసన రాజధాని గాను, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం రాష్ట్ర సచివాలయంతో పరిపాలనా రాజధాని గాను, రాయలసీమలోని కర్నూలు హైకోర్టుతో న్యాయ రాజధాని గానూ మూడు రాజధానులు ఉంటాయని,ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన, అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న విదేశీ పెట్టుబడిదారులతో సహా ప్రతి ఒక్కరినీ గందరగోళానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని రైతులు, స్థానికులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.

కాగా, అమరావతి రాజధాని నిర్మాణాన్ని రాజకీయ కారణాలతో  జగన్ రెడ్డి పక్కనపెట్టడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దేశంలో అప్రతిష్టను మోయాల్సి వస్తోంది. రాజధానంటూ లేకపోవడంతో ఏపీ ప్రజలు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు తరలివెళ్తుండడం గమనార్హం. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడినట్టు అర్థమవుతోంది. మరో వారం రోజుల్లో వచ్చే ఫలితాలను బట్టి ఏపీ రాజధాని భవిష్యత్ తేలనుంది.

TAGS