Maldives : భారత్..వేల ఏండ్లుగా ఇతరుల మీదకు దాడికి పోలేదు..తనకు తాను ఆక్రమణలు చేయలేదు.. పొరుగు దేశాలపై కుట్రలు పన్నలేదు.. ఎవరైనా తనపైకి దాడికి వస్తేనే ప్రతిదాడి చేసేది. అంతే తప్ప ముందుగా ఏదేశంపైకి యుద్ధానికి వెళ్లలేదు. చుట్టుపక్కల దేశాలకు ఉన్నదాంట్లో ఇంత సాయం చేయడమే తప్ప వారి నుంచి బావుకున్నదీ లేదు. ఇలా ఒక్క పాకిస్తాన్ తప్ప..ఆప్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు..ఇలా ప్రతీ దేశానికి ఏ స్వార్థం లేకుండా మన దేశమే భారీ మొత్తంలో సాయం అందిస్తోంది. ఇది వారికి కూడా తెలుసు.
ఇదే అదనుగా ఆయా దేశాల్లోకి కుటిలనీతితో చైనా ప్రవేశిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇన్ షియేటివ్ పేరుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ..ఆయా దేశాలను అప్పుల కుప్పలుగా మారుస్తోంది. ఆ దేశాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని మన దేశం పైపు ఉసిగొల్పుతోంది. గతంలో శ్రీలంక, నేపాల్ ఇలానే చేశాయి. ఇందులో శ్రీలంక.. చైనా దుర్బిద్ధి ఏంటో స్వయంగా తెలుసుకుంది. ఇప్పుడదే తప్పు మాల్దీవులు చేస్తోంది. మొన్న అక్కడ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మొహమ్మద్ మొయిజు చైనా అనుకూలవాది. ఇతడికి భారత్ అంటే సుతారమూ ఇష్టముండదు.
అంతే కదా కొందరు మంచి చేసేవారికంటే నిండా ముంచే వారిని ఎక్కువగా నమ్ముతారు. మేక కసాయి వాడిని నమ్మినట్టుగా. ఇక మొయిజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాకు అనుకూలంగా.. ఇండియాకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అరె బుల్లిదేశం.. పాపం సాయం చేద్దామని భారత్ అనుకుంటుంటే.. వారే ఏకు మేకు అవుతున్నారు. వాస్తవానికి మన టూరిస్టులు వెళ్తేనే ఆ దేశానికి ఆదాయం. లేకుంటే అక్కడ అన్నీ ఇసుక దిబ్బలు మాత్రమే. అయినా కూడా మనదేశంపై ఈమధ్య అవాకులు చెవాకులు పేలుతోంది.
మనపైకి తొడలు కొడుతున్న మాల్దీవ్స్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని మోదీ భావించారు. ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజంపైనే దెబ్బ కొట్టాలని భావించారు. మన దేశంలోని లక్షద్వీప్ లో ఆయన రీసెంట్ గా పర్యటించారు. ఇక్కడా ఎన్నో అందమైన బీచ్ లు, ప్రాంతాలు ఉన్నాయని దేశ టూరిస్టులు అందరూ లక్షద్వీప్ లో పర్యటించాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షద్వీప్ కు ఎక్కడలేని ప్రాధాన్యం లభించింది. పలువురు ప్రముఖులు కూడా తాము లక్షద్వీప్ కు వెళ్తామని, మాల్దీవులకు వెళ్లమని ప్రకటనలు చేశారు.
దీంతో గాబరా పడిన మాల్దీవుల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మోదీపై, భారత్ పై నానా కూతలు కూశారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం చేసింది. దేశంలో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో దెబ్బకు మాల్దీవ్స్ ట్రిప్స్ భారీగా పడిపోయాయి. ఫ్లైట్ టికెట్స్ డ్రాప్ అయిపోయాయి. ఇక ఆదేశానికి వణుకు మొదలైంది. తమ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అవి వారి వ్యక్తిగతమని, వారిని సస్పెండ్ చేశామని దిద్దుబాబు చర్యలు తీసుకుంటోంది.
ఇక ఆ దేశ అధ్యక్షుడు మొయిజు ఉన్న పళంగా చైనా ట్రిప్ వేశాడు. అక్కడి ప్రజాప్రతినిధులతో వరుసగా భేటి అవుతున్నాడు. నిన్న మాల్దీవుల బిజినెస్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘తమ దేశానికి విరివిగా టూరిస్టులను పంపాలని’’ బతిమాలుకున్నాడు. చైనా తమకు సమీప మిత్రుడని సంబోధిస్తూ, తమ అభివృద్ధి భాగస్వాముల్లో ఒకటని కొనియాడారు.
మంచి చేయాలని భావించే భారత్ ను వదిలిపెట్టి.. పెట్టుబడుల పేరుతో దేశాలను గుప్పిట పట్టుకుని ఆడించే చైనా వైపునకు మాల్దీవ్స్ వెళ్తోంది. మోదీ ఒక్క పిలుపుతోనే మాల్దీవ్స్ విలవిలలాడిపోతోంది. చైనాతో మరింతగా అంటకాగితే ఆ దేశానికే తీవ్ర నష్టం. అక్కడి పాలకులు ఇది తెలుసుకుని మెసిలితే మంచిది. ఇక లక్షద్వీప్, అండమాన్ లో గనక మన టూరిస్టుల సంఖ్య పెరిగితే మాల్దీవ్స్ కు భవిష్యత్ లో పెద్ద దెబ్బే అని చెప్పనక్కర్లేదు.