Komati Reddy : నల్గొండ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎంత పట్టుందో మనకు తెలియంది కాదు. సీఎం పదవికి వారు ఎంతగా పట్టుబట్టిన చివరకు మంత్రి పదవే దక్కింది. అయితే వీరు ఎప్పుడు ప్లేటు ఫిరాయించేది చెప్పలేమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తునే ఉంటాయి. తాజాగా ఈ విషయమై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోపం వచ్చింది. తనను మీడియా చిట్ చాట్ లలో షిండే గా మారుస్తూ.. పార్టీలో చీలిక తెస్తానన్నట్లుగా మాట్లాడుతున్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పై ఒక్క సారిగా వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. వీరిద్దరు చేస్తున్న ప్రకటనలతో..తనపై కాంగ్రెస్ లో అపనమ్మకం పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారేమో కానీ.. వెంటనే రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ప్రకటించేశారు. కాంగ్రెస్ లో గ్రూపులు లేవని..రేవంత్ పదేళ్ల పాటు సీఎంగా ఉంటారన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం ఉండదని చెప్పేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కువగా కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కోమటిరెడ్డితో పాటు ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిపేసుకుంటున్నారు. వీరిద్దిలో ఒకరు షిండే అవుతారని.. బీజేపీతో కలుస్తారన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి గతంలో రేవంత్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
తనను షిండేతో పోలుస్తూ.. చేసే ప్రచారాలు మరింత పెరిగితే.. తనపై కాంగ్రెస్ లో నమ్మకం సడలిపోతుందని.. మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనతో గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కోమటిరెడ్డి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇంకోసారి ఎవరైనా తన పేరు ప్రస్తావనకు తెస్తే షిండే అని అంటే తిట్ల దండకమందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ లో ఎప్పుడు ఏదైనా జరుగవచ్చని, ఎన్నికల తర్వాత ఆ పార్టీ హామీలు నెరవేర్చకుంటే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యలు కాంగ్రెస్ తలకు చుట్టుకునేలా ఉన్నాయి. ఇదే తరుణంలో ‘షిండే’లు తయారు కావొచ్చనే టాక్ వినపడుతోంది.