T20 World Cup : దేశంలో ఐపీఎల్ హవా నడుస్తోంది. మరో నెల రోజుల దాక ఈ టోర్నీ సాగనుంది. సమ్మర్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు ఐపీఎల్ మజా తెస్తోంది. అయితే ఐపీఎల్ సంబరం ముగియగానే మరో పెద్ద టోర్నీ ప్రారంభం కాబోతోంది. టీ 20 వరల్డ్ కప్ జూన్ లో జరుగబోతోంది. ప్రపంచకప్ లో టీమిండియా సత్తా చాటాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు సీనియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరముందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ ఐపీఎల్ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. 40 బంతుల్లో సెంచరీ చేయగల సత్తా అతడిలో ఉందన్నాడు. ముఖ్యంగా టీ 20ల్లో ప్లేయర్ల వయసుకు సంబంధించి ఓ నిర్దిష్ట నియమమేది లేదన్నారు. జేమ్స్ అండర్సన్ ఇంకా టెస్టులు ఆడుతూ 30 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడన్నారు. అలాగే 40 ఏండ్ల ధోని ఇంకా సిక్సర్లు బాదుతున్నాడన్నారు.
రోహిత్, విరాట్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, పాండ్యా..ఇలా చాలా మంది అద్భుత ఆటగాళ్లున్నారన్నారు. బౌండరీలు బాదడంతో వారి నైపుణ్యం అద్భుతమన్నారు.
టీ 20 ప్రపంచకప్ నకు జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీ, కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ పై ఉందని గంగూలీ గుర్తుచేశాడు. అయితే తాను మాత్రం కోహ్లీ, రోహిత్ కలిసి ఓపెనింగ్ కు దిగితే బాగుంటుందని భావిస్తున్నానన్నాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, సెలెక్టర్లు కచ్చితంగా ఇలాగే చేయాలని తాను సూచించడం లేదన్నాడు. తుది నిర్ణయం వారిదేనని స్పష్టం చేశాడు.