IPL 2024 Qualifier-2 : క్వాలిఫయర్-2 మ్యాచ్ రద్దయితే ఫైనల్ కు వెళ్లే జట్టు ఇదే
IPL 2024 Qualifier-2 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 24న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ రెండో క్వాలిఫయర్‌కు చేరుకుంది. ఇప్పుడు హైదరాబాద్, రాజస్థాన్ మధ్య జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఏ జట్టు గెలుస్తుంది. మే 26న చెన్నైలోనే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఫైనల్ ఆడనుంది. తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓడించింది. ఫైనల్స్‌కు చేరుకోవడానికి ఇరు జట్లూ తమ సర్వశక్తులు ఒడ్డుతాయి.
క్వాలిఫయర్ 2-చెన్నై పిచ్ నివేదిక
చెన్నైలోని చిదంబరం స్టేడియంలోని పిచ్ నెమ్మదిగా ఉంటుంది. చెపాక్‌లో స్పిన్నర్లకు చాలా సహాయం అందుతుంది. అయితే బ్యాట్స్‌మెన్ నిరంతరం కష్టపడుతున్నారు. ఇక్కడ పెద్ద స్కోర్లు సాధించడం అంత సులువు కాదు. బ్యాట్స్‌మెన్ రాణించాలంటే ఇక్కడికి వచ్చి కొంత సమయం కేటాయించాలి. ఒక్కసారి పిచ్‌ని అర్థం చేసుకుంటే తర్వాత పెద్ద మొత్తంలో పరుగులు సాధించే అవకాశాలు ఉన్నాయి.
వర్షం ముప్పు
క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం తమిళనాడులో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై తో పాటు 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుఉండడంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23, 24 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్ రద్దయితే తర్వాత పరిస్థితి ఏమిటనే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే నిర్వహించాల్సి ఉంది. ఆ రోజు కూడా వర్షం పడితే ఎలా అని క్రికెట్ అభిమానులు చర్చించకుంటున్నారు.
మ్యాచ్ రద్దయితే ఆజట్టు ఫైనల్ కు?
క్వాలిఫయర్-2 మ్యాచ్‌కి రిజర్వ్‌డే ఉందని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయితే రిజర్వ్‌డే న ఆట కొనసాగుతుంది. మరుసటి రోజు అంటే మే 25 శనివారం రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. క్వాలిఫయర్-2తో మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్‌కి కూడా రిజర్వ్ డేను నిర్వాహకులు కేటాయించారు. క్వాలిఫయర్ మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా ఫలితం తేలకపోతే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్ కు వెళ్తుంది. టాప్-2లో ఉన్న సన్‌రైజర్స్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
మరోవైపు ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్‌డే రోజు జరుగకపోతే.. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న టీమ్‌ను చాంపియన్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ లెక్కన కేకేఆర్ కప్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఏ సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కాలేదు. గతేడాది గుజరాత్, చెన్నై ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగితే.. రిజర్వ్‌డే రోజున ఆట కొనసాగించారు. అందులో సీఎస్కే విజయం సాధించింది.