Bolla Brahmanaidu : పేదలు ధనవంతులవుతుంటే.. పెత్తందార్లు ఒక్కటవుతున్నారు: ప్రతిపక్షాలపై బొల్లా బ్రహ్మనాయుడు మండిపాటు
Bolla Brahmanaidu : రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ మరోసారి అధికారంలోకి వస్తే పేదవారు ధనికులు అవుతారని, పెత్తందారులు అందరూ ఒక్కటవుతున్నారని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలోని ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, గోదామును కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన విధానాన్ని తీసుకొచ్చి, 1 లక్ష 30వేల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటి గడప ముందుకు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. ఎలాంటి సమస్యలైన గ్రామంలోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు గ్రామ పరిపాలన విధానం తీసుకొచ్చారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య వచ్చినా మండల కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరాగాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ నవరత్న పథకాలు నేరుగా అందుతున్నాయన్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ ను రూ.1,000 ఇస్తే ఈనాడు ఆ పెన్షన్ ను రూ.3,000లకు జగన్ ప్రభుత్వం పెంచిందన్నారు. అర్హులైన వారందరికీ ప్రతినెల 1వ తారీఖున తెల్లవారుజామున వలంటీర్లు ఇంటికి వచ్చి మరి పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు సుపరిపాలన అందిస్తే, నేడు ఆయన బిడ్డగా మరో ముందడుగు వేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకొచ్చారన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం జగన్ కృషి చేస్తుంటే, ప్రతిపక్ష పెత్తందారి పార్టీలు అబద్ధపు ప్రచారంతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే రానున్న ఎన్నికల్లో పెత్తందారులకు, పేద ప్రజలకు యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో ప్రజలు మంచివైపు అడుగులు వేయాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజల సేవకే అంకితమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
పది సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే, జీవీ ఆంజనేయులు విలాసాల కోసం పదవిని వాడుకున్నారని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపించారు. ప్రజలకు ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగిన అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. అలాగే మాయ కంపెనీల ద్వారా మట్టికి రంగు వేసి ఎరువు అని చెప్పి అమ్మి రైతులను కూడా మోసం చేసిన నీచ బతుకు ఆంజనేయులుది అని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ ప్రజల ముందుకు వచ్చి తమ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలను పంచిపెడ్తానని, ప్రజా ధనాన్ని లూటీ చేసేందుకు అనుమతులు కల్పిస్తానని హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పాలన వస్తే రౌడీ రాజ్యంగా మార్చి ఊరి మీద పడి దోచుకునేలా వీలుకల్పిస్తామని జీవీ ఆంజనేయులు అంటున్నారని, వీరి నాటకాలను ప్రజలు గమనించాలని సూచించారు.
ఆడపడుచులకు పండుగ కానుక..
వినుకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అన్నగా చిరు కానుక అందిస్తున్నామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతీ సోదరికి పండుగ కానుకను అందించడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నూజండ్ల మండలంలోని పలు గ్రామాల్లో చీరల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. సంవత్సరంలో తొలి పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతీ అడపడుచుకు తాను అన్నగా భావించి పండుగ కానుకగా చీర పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ పండుగ అందరూ ఎంతో సాంప్రదాయ పద్ధతిలో జరుకుంటారని, రైతులందరికీ ఈ పండుగ ప్రధానమైనదన్నారు. ఆ భగవంతుడి చల్లని దీవెనలు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.